- నిబంధనలకు విరుద్ధంగా ఏజెన్సీలో క్వారీలు
- ’పీసా‘ చట్టం బేఖాతర్
- ఆదివాసీలకు తీరని నష్టం
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక క్వారీల కేటాయింపులో నిబంధనలను గాలికి వదలి అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇసుక సహా చిన్న తరహా ఖనిజ సంపద ఆదివాసీలకే దక్కాలని షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయితీ రాజ్ విస్తరణ (పీసా) చట్టం చెప్తున్నప్పటికీ దీనిని పెడ చెవిన పెడుతున్న అధికార యంత్రాంగం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నది. ఆదివాసీల కడుపు కొట్టి ఖజానా నింపుకోవడమే కాక దొడ్డి దారిన కాంట్రాక్టర్లకు రీచులను అప్పగించడం ద్వారా అధికారులు భారీ అక్రమానికి తెర లేపారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత గనుల శాఖ 3, 38 జీవోలను విడుదల చేసింది. ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక రీచ్ లు ’పీసా‘ చట్టానికి లోబడి కేటాయించాలని ఈ జీవోల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ జిల్లా కలెక్టర్లు చైర్మెన్లుగా వ్యవహరిస్తున్న జిల్లా ఇసుక కమిటీలు నిబంధలకు విరుద్ధంగా ఇసుక క్వారీలను తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయిస్తూ ఆదివాసీలకు రావాలసిన ఆదాయానికి భారీగా గండి కొడుతున్నాయి.
’పీసా‘ చట్టం ఏమి చెప్తున్నది?
కేంద్ర ప్రభుత్వం 1996 లో పీసా చట్టం రూపొందించగా ఉమ్మడి రాష్ట్రంలో 2008లో దీనిని అమల్లోకి తెచ్చారు. 2011 లో పంచాయితీరాజ్ శాఖ జీవో నంబర్ 66 ద్వారా మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. ఈ జీవోలోని ఏడవ నిబంధన ప్రకారం ఇసుక తదితర చిన్న తరహా ఖనిజాల అనుమతుల కోసం స్థానిక ఆదివాసీ వ్యక్తులు ఆదివాసీ సహకార సంఘాలు, ఆదివాసీ మైనింగ్ కార్పొరేషన్ నుంచి ఇసుక క్వారీల కోసం గనుల శాఖ దరఖాస్తులను సేకరించాలి. వేలం ద్వారా వీటిని కేటాయించాలి. దరఖాస్తులను గ్రామ పంచాయితీ, గ్రామ సభల అనుమతి కోసం పంపాలి. గనుల శాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చిన నాలుగు వారాల్లో అనుమతుల ప్రక్రియను పూర్తి చేసి పంపాలి.
రైజింగ్ కాంట్రాక్టర్ల పేరుతో…
ఇసుక క్వారీలను పూర్తిగా ఆదివాసీ సహకార సంఘాలకు కేటాయించకుండా జీవోకు విరుద్ధంగా జిల్లా ఇసుక కమిటీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయిస్తూ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. ఆదివాసీ సహకార సంఘాలకు మైనింగ్ అనుమతులు ఇవ్వకుండా వాటిని రైజింగ్ కాంట్రాక్టర్లంటూ వింత పదాన్ని తగిలించాయి. యజమానులను కూలీలుగా మార్చేశాయి. క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ. 600 నుంచి 650 వసూలు చేస్తుండగా వీటిలో కేవలం రూ. 220 మాత్రమే ఆదివాసీ సహకార సంఘాలకు చెల్లిస్తూ మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసుకుంటున్నారు. చట్ట ప్రకారం రాయల్టీ మొత్తం రూ. 60 పోనూ మిగిలిన మొత్తం ఆదివాసీ సహకార సంఘాలకు మాత్రమే దక్కాల్సి ఉంటుంది.
ఇసుక తవ్వకాలను ఆదివాసీలకు అప్పగించకుండా అనధికారిక కాంట్రాక్టర్లను ప్రవేశపెట్టి సహకార సంఘాలకు చెల్లించే రూ. 220 లో రూ. 180 గుండుగుత్తగా వారికి చెల్లిస్తున్రు. ఈ తతంగమంతా జిల్ల కలెక్టర్ల కనుసనల్లోనే జరుగుతున్నది. ఆదివాసీ ప్రాంతమైన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ అక్రమ దందా కొనసాగుతున్నది. ఇసుక క్వారీల అక్రమ కేటాయింపులపై హైకోర్టులో విచారణ కూడా జరుగుతున్నది. రాష్ర్టం ఏర్పడిన తర్వాలత జరుగుతున్న అతి పెద్ద స్కామ్ లలో ఒకటిగా ఏజెన్సీ ఇసుక తవ్వకాలను పేర్కొన వచ్చు. ఇప్పటికే రూ. 500 కోట్లు అక్రమంగా కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్ళాయి.