ఆహారం, నీరు దొరక్క అవస్థలు
సాయం కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి వినతి
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి . కేదార్‌నాథ్ ప్రాంతంలో అయితే కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేదార్‌నాథ్‌కు వెళ్లిన అనేక మంది యాత్రికులు వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎదురయ్యింది. అలాగే పలువురు తెలుగు యాత్రికులు కూడా కేదార్‌నాథ్ వద్ద వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. క్లౌడ్ బరస్ట్, భారీ వర్షాల కారణంగా నడక మార్గం దెబ్బతిన్నది.
గౌరీకుండ్ – కేదార్‌నాథ్ మధ్య 13 చోట్ల మార్గం విధ్వంసమైంది. దీంతో పలువురు యాత్రికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. దీంతో పోలీసులు, సహాయక బృందాలు యాత్రికులను హెలీకాప్టర్లతో తరలిస్తున్నారు. అయితే అక్కడి ప్రతికూల వాతావరణం సహాయ చర్యలకు విఘాతం కల్గిస్తున్నది. స్థానికులకే ప్రాధాన్యతనివ్వడంతో దూరప్రాంత యాత్రికులు అక్కడే నిలిచిపోయారు.
దీంతో ఆహారం, నీరు అందక యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. కేదార్‌నాథ్ స్వర్గ రోహిణి కాటేజిలో పలువురు తెలుగు యాత్రికులు సహాయం కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు మెసేజ్ చేశారు. ఆహారం, నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని తమకు సహాయం అందించాల్సింది గా కేంద్రమంత్రిని తెలుగు యాత్రికులు కోరారు. వెంటనే స్పందించిన బండి సంజయ్.. ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగంతో మాట్లాడారు. వారిని సురక్షితంగా బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.