A place where you need to follow for what happening in world cup

పున్నమి చంద్రుడు.. కొమురం భీము…

0 35,958

కొమురం భీము.. ఇది కేవలం ఐదక్షరాల పేరు కాదు. ఆదివాసీల అస్థిత్వ నినాదం. ఆత్మగౌరవ పోరాట బావుటా. జల్, జంగల్, జమీన్ నినాదంతో జోడెఘాట్ కేంద్రంగా భీము నాయకత్వంలో ఆదివాసీలు నైజాం ప్రభుత్వంపై చేసిన పోరాటం దేశం దృష్టిని ఆకర్షించింది. భూమి కోసం, భుక్తి కోసం, అడవి కోసం పోరు బాట చూపించింది. కొమురం భీమ్ వెలిగించిన కొర్రాయి వెలుతురులో రేపటి వెలుగుల కోసం ఆదివాసీలు నేటికి పోరాడుతూనే ఉన్నారు. దారి చూపించిన భీమును ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు. జోడె ఘాట్ లో పున్నమి చంద్రుడిగా భీము అడవిలో వెలుగులు పూయిస్తూనే ఉన్నాడు. కొమురం భీము వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్రను సంక్షిప్తంగా ఇస్తున్నాం.
కొండూరి రమేష్ బాబు, ఎడిటర్

1915 సంవత్సరం నాటికి కొమురం భీము వయస్సు ఇంచు మించు 15 సంవత్సరాలు. సంకెపల్లిలో అతని కుటుంబం షావుకార్లు. అటవీ అధికారులతో అనేక బాధలు పడింది. భీము తండ్రి చిన్ను విషజ్వరం బారిన పడి సంకెపల్లిలో చనిపోయిన తరువాత కొమురం చిన్ను తమ్ములు కుర్దు, యేసు సుర్దాపూర్ వెళ్ళి స్థిర పడ్డారు. సుర్దాపూర్ లో పంట చేతికొచ్చే సమయానికి తురుక పట్టాదారు సిద్దిక్ సుర్దాపూర్ లోని భూములన్నీ తన పట్టా అని వచ్చాడు. గలాటాలో భీము సిద్దిక్ బట్టతల మీద కొట్టడంతో అతను చనిపోయాడు. ఈ సంఘటన తర్వాత సుర్దాపూర్ పోలీసుల కోపానికి బలైంది. భీము భయంతో పారిపోయి బలర్షా మీదుగా చాందా చేరుకుని అటునుంచి చాయ్ పత్తా దేశం (అస్సాం తేయాకు తోటల్లోకి) పారిపోయి ఐదేండ్లు కూలీగా బతికాడు. ఈ కాలంలో భీము చదవడం, రాయడం నేర్చుకోవడంతో పాటు దేశంలోని అప్పటి తిరుగుబాట్ల గురించి , రాజకీయాల గురించి తెలుసుకున్నాడు. అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన మన్నెం తిరుగుబాటు గురించి తరచూ తమకు చెప్పావాడని సూరు చెప్పేవాడు.

సుర్దాపూర్ నాశనమైన తర్వాత కుర్దు పంగిడిరాజు జంగుబాబు దగ్గర కౌలు చేసుకుని బతుక సాగాడు. యేసు ధనోరా వైపు వచ్చి మళ్ళీ అడవి నరికి బంగ్లాతు వాళ్ళు ఊరు కాలబెట్టగా గూడెం నుంచి గూడెం మారాడు. భీము అన్నలు కాకన్ ఘాట్ వెళ్ళి పాలేర్లుగా స్థిరపడ్డారు. భీము తేయాకు తోటల్లో ఒక తిరుగుబాటులో పాల్గొని నిర్భంధించబడి అక్కడి నుంచి తప్పించుకుని చాందా మీదుగా కాకన్ ఘాట్ చేరాడు. దేవడం లచ్చు పటేల్ దగ్గర నౌఖరి కుదిరాడు. లచ్చు పటేల్ కు, జంగ్గాత్ వాళ్ళకు మధ్య ఒక తగాదాను భీము గెలిపించాడు. ఇది మొత్తం గూడేల్లో పాకిపోయింది. పంగిడిరాజు వెళ్ళగొట్టడంతో కుర్దు ధనోరాలో ఉన్నయేసు దగ్గరికి వచ్చాడు. వాళ్ళిద్దరన్నదమ్ములు తెగించి బాబేఝరి కేంద్రంగా చుట్టూ పన్నెండు గ్రామాలు పొందించి వందల ఎకరాలు అడవిని నరికారు. అడవి నరకడం ఉద్యమ రూపం దాల్చింది. అప్పుడు ప్రభుత్వం రంగంలోకి దిగి అనేక కేసులు పెట్టింది. గూడేలు కాలబెట్టి పంటలు నాశనం చేస్తూ భయోత్పాతాన్ని సృష్టించ సాగింది. అప్పుడు ఆ పన్నెండు గ్రామాల ప్రజలకు ప్రభుత్వంతో వ్యవహరించడానికి ఒక నమ్మకస్తుడైన మనిషి కావాల్సి వచ్చింది. కుర్దు, యేసు తమకు సహాయంగా భీమును తీసుకు వెళ్ళారు. రాత పనికి మహదును నియమించుకున్నారు. కేసుల చుట్టూ తిరుగుతుండగా జనకపురం సాలె పంతులు లాంటి వాళ్ళు ఈ సమస్యను నైజాం నవాబుకు ముఖా ముఖీ నివేదించుకోవాలని సలహా ఇచ్చారు. భీము, రఘు, మహదు హైదరాబాద్ వెళ్ళి నైజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దర్శనం దొరకక అవమానం పాలై వచ్చారు.

 ఈ సారి మరింత సంఘటితంగా నిలబడి మొదటి సారిగా జోడెఘాట్ లో అటవీ అధికారుల మీద తిరగబడ్డారు. వారిపై మరిన్ని కేసులు పెట్టారు. అరెస్టులు జరిగాయి. అరెస్టయిన వారు బెయిల్ మీద తిరిగి వచ్చిన తర్వాత భీము నాయకత్వంలో కేసులను, ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నట్లుగా ప్రకటించారు. సమన్లు తెచ్చి అరెస్టు చేయాలనుకున్న పోలీసులను తన్ని పంపించారు. ఆ విధంగా సమస్య ప్రభుత్వానికి, గోండు కోలామ్ ప్రజలకు మధ్య యుద్ధంగా రూపు దాల్చింది. ప్రభుత్వం నయానా భయానా వారిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించింది. భీము సైన్యాన్ని తయారు చేయసాగాడు. చివరి ప్రయత్నంగా సబ్ కలెక్టర్ ను ప్రభుత్వం చర్చలకు జోడెఘాట్ కు పంపించింది. పన్నెండు గ్రామాలకు పట్టాలు ఇవ్వడమే కాక అన్ని రకాల అప్పులను మాఫీ చేయిస్తామని, పోరాటాన్ని విరమించాల్సిందిగా సబ్ కలెక్టర్ ప్రతిపాదించాడు. కానీ పన్నెండు గ్రామాల మీద రాజ్యాధికారాన్ని కొమురం భీము డిమాండ్ చేశాడు. చర్చలు విఫలమయ్యాయి.

ఇరుపక్షాలు ప్రత్యక్ష యుద్ధానికి తలపడ్డాయి. దాదాపు ఏడు నెలల పాటు నైజాం సైన్యానికి, భీము సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. చివరిగా నైజాం వాళ్ళు మూడు వందలకు పైగా సైన్యాన్ని భారీ మందుగుండు సామగ్రితో పంపగా వారి మధ్య ఐదు గంటల పాటు యుద్ధం జరిగింది. చివరికి జోడెఘాట్ మీదకి ఎక్కిన నైజాం సైన్యానికి గొండిగూడెం నివాసి ద్రోహి కుర్దు పటేల్ భీమును చూపించగా సైనికులు భీమును కాల్చి చంపారు. భీము మరణించిన తర్వాత పన్నెండు గ్రామాల ప్రజలు చెల్లా చెదరయ్యారు. తర్వాత ప్రభుత్వం జోడెఘాట్ పోరాటాన్ని అణచడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. 1946 లో తిర్యాణి కేంద్రంగా పనిచేసిన తెలంగాణ సాయుధ దళాల్లో ఒకటైన గోపాలరావు దళం ద్రోహి కుర్దు పటేల్ ను చంపేసింది.
(సాహు, అల్లం రాజయ్య రాసిన కొమురం భీము నవల ఆధాగారంగా)

Leave A Reply

Your email address will not be published.