చంద్రయాన్ 3 కి సంబంధించి రోజుకో ఆసక్తికర అప్‌డేట్ షేర్ చేస్తున్న ఇస్రో…ఇప్పుడు ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది. ప్రజ్ఞాన్ రోవర్ వీడియోని షేర్ చేసింది. చంద్రుడి ఉపరితలంపై రోవర్ అటూ ఇటూ కదులుతున్న వీడియోని ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రోవర్ 360 డిగ్రీల కోణంలో తిరుగుతోంది. సేఫ్ రూట్‌ని చూసుకుంటూ ముందుకు కదులుతుండటాన్ని గమనించవచ్చు. ఇందులో రోవర్ డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. ఈ వీడియోపై ఇస్రో చాలా పొయెటిక్‌గా స్పందించింది. రోవర్ చంద్రుడిపై తిరుగుతుంటే చిన్న పిల్లాడు చందమామపై ఆడుకుంటున్నట్టుగా ఉందని ట్వీట్ చేసింది. “సేఫ్ రూట్ కోసం రోవర్ ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలోనే 360 డిగ్రీల కోణంలో తిరుగుతోంది. ల్యాండర్ ఇమేజర్ కెమెరా ఈ వీడియోని రికార్డ్ చేసింది. ఈ వీడియో చూస్తుంటే ఓ చిన్న పిల్లాడు చందమామపై ఆడుకుంటుంటే తల్లి ఆ పిల్లాడిని చూస్తూ సంతోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది”అంతకు ముందు చంద్రయాన్ 3 కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది ఇస్రో. చంద్రుడి సౌత్‌పోల్‌పై ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి డేటాని పంపిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండర్ విక్రమ్‌ని ఫొటో తీసి పంపింది.
నావిగేషన్ కెమెరాతో ఈ ఫొటో క్లిక్ చేసింది. చంద్రుడిపై ల్యాండ్ అయిన తరవాత ప్రజ్ఞాన్ రోవర్ తీసిన తొలి ఫొటో ఇదే. ఇప్పటి వరకూ అక్కడి నుంచి వచ్చిన ఫొటోలు, వీడియోలు అన్నీ ల్యాండర్ విక్రమ్ తీసినవే. ఇదే విషయాన్ని ఇస్రో అధికారికంగా వెల్లడించింది. ట్విటర్‌లో విక్రమ్ ల్యాండర్ ఫొటోని షేర్ చేసింది. “Image of the Mission” అంటూ పోస్ట్ చేసింది. రోవర్‌పై ఉన్న NavCams (నావిగేషన్ కెమెరా)ని బెంగళూరుకి చెందిన Electro-Optics Systems కంపెనీ తయారు చేసింది. ఇప్పటికే చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి కీలక వివరాలు అందిస్తోంది చంద్రయాన్ 3. ప్రపంచ దేశాల్లో ఎవరి వద్దా లేని అత్యంత అరుదైన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని ఇటీవలే ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.