- ఆర్మీ ట్రక్కు లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 9 మంది జవాన్ల మృతి
- మృతుల్లో రంగారెడ్డి జిల్లా తిర్మన్‌దేవునిపల్లికి చెందిన నీరటి చంద్రశేఖర్
- సెలవులకు గ్రామానికి వచ్చి ఏప్రిల్‌లోనే తిరిగి వెళ్లిన జవాను
- అంతలోనే మృత్యువాత
జమ్మూకశ్మీర్‌లోని లఢఖ్‌లో శనివారం ఓ ఆర్మీట్రక్కు లోయలో పడగా, మృతి చెందిన 9 మంది జవాన్లలో తెలంగాణ వాసి కూడా ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తంగళ్లపల్లి పంచాయతీ పరిధిలోని తిర్మన్‌దేవునిపల్లికి చెందిన నీరటి చంద్రశేఖర్ (29) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
చంద్రశేఖర్ 2010లో ఆర్మీలో చేశారు. 2017లో కక్లూరుకు చెందిన లాస్యను వివాహం చేసుకున్నారు. వీరికి వర్షిత్ (4) అనే బాబు, సహస్ర అనే రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ ఏడాది మార్చి 17న గ్రామానికి వచ్చిన చంద్రశేఖర్ సెలవుల అనంతరం ఏప్రిల్‌లో తిరిగి వెళ్లారు. మరో రెండేళ్ల సర్వీసు పూర్తయితే ఆయన స్వగ్రామానికి వచ్చేవారే. అంతలోనే విధి కబళించింది. చంద్రశేఖర్ మృతి వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.