- చంద్రయాన్ గురించి ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్
- చంద్రుడిపై నుంచి పంపిన తొలి ఫొటో ఇదేనంటూ
- ఓ వ్యక్తి టీ పోస్తున్నట్టుగా ఉన్న కార్టూన్ షేర్ చేసిన నటుడు
- మోదీ, బీజేపీపై గుడ్డి ద్వేషాన్ని ఆయన శాస్త్రవేత్తలపై చూపిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు
నరేంద్ర మోదీ, బీజేపీపై విరుచుకుపడుతూ తన మనసులోని మాటలను నిర్భయంగా చెప్పే ప్రకాశ్ రాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ట్విట్టర్లో ఆయన దారుణంగా ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఇస్రో ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్ గురించి ఆయన చేసిన వ్యంగ్య, వివాదాస్పద ట్వీట్ పై పలువురు తీవ్రంగా స్పందిస్తున్నారు. చొక్కా, లుంగీ ధరించిన ఓ వ్యక్తి టీ పోస్తున్నట్టుగా ఉన్న ఓ కార్టూన్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన ప్రకాశ్ రాజ్ చంద్రయాన్ మిషన్ ద్వారా పంపించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి నుంచి పంపిన తొలి ఫొటో ఇదే అని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ప్రభుత్వంపై ఉన్న ద్వేషాన్ని ఆయన దేశ శాస్త్రవేత్తలపై చూపిస్తున్నారని, చరిత్రాత్మక మిషన్‌ను అపహాస్యం చేశారంటూ విమర్శిస్తున్నారు. రాజకీయాలకు, దేశాన్ని విమర్శించడానికి మధ్య ఉన్న తేడా తెలుసుకోవాలని ఓ వ్యక్తి సూచించారు. బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై గుడ్డి ద్వేషం కారణంగానే ఆయన ఈ పోస్టు చేశారని పలువురు అభిప్రాయపడ్డారు. శాస్త్రవేత్తల కృషిని ఎగతాళి చేసేలా ట్వీట్ చేశాడంటూ విరుచుకుపడుతున్నారు. ‘చంద్రయాన్ 3 దేశానికి గర్వకారణం. అంతేతప్ప ప్రకాశ్ రాజ్ గుడ్డి ద్వేషానికి సాధనం కాదు’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.