భదాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో ఖాలీగా ఉన్న డాక్టర్ల పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. సోమవారం భదాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌ని కమిషనర్ పరిశీలించారు. పిల్లల వార్డులతోపాటు అత్యవసర విభాగాన్ని, ప్రసూతి విభాగాన్ని కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ…భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో, వైద్య విధాన పరిషత్‌లో ఉన్న 1903 పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని అన్నారు. హాస్పిటల్‌లోని డాక్టర్ల పనితీరుపై పరిశీలన ఉంటుందని, హాస్పిటల్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని కమిషనర్ తెలిపారు.
పేద ప్రజలందరికీ ప్రభుత్వ హాస్పిటల్‌లో మెరుగైన వైద్య సేవలు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు. మీడియాలో వొస్తున్న వార్తలను చూసి ప్రిన్సిపల్ సెక్రటరీ పంపడం వల్ల భద్రాచలం వొచ్చి హాస్పిటల్‌ని పరిశీలించడం జరిగిందని కమిషనర్ తెలిపారు. అంతకు ముందు కమిషనర్ శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
పెండింగ్ సమస్యలు పరిష్కరించండి : కమిషనర్‌కు సిపిఎం వినతి పత్రం
ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఉన్న సమస్యలు, కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని, నాలుగు రాష్ట్రాలకు సముదాయమైన ఏజెన్సీ హాస్పటల్‌కు వైద్యులను వెంటనే నియమించాలని, హాస్పిటల్ పనిచేస్తున్న డాక్టర్లు సమయపాలన పాటించేలాల చూడాలని కమిషనర్‌కు సిపిఎం సిఐటియు నాయకులు వినతి పత్రం అందజేశారు.