సవాళ్లను అధిగమిస్తూ పరిష్కార మార్గాలతో ముందుకు..
గనుల రంగంపై జాతీయ సదస్సులో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి
ఎక్స్‌ప్లొరేషన్‌పై దృష్టికి కేంద్రం సంపూర్ణ సహకారం
పదేళ్లుగా మోదీ ప్రభుత్వం సంస్కరణలతో ఈ రంగంలో సానుకూల మార్పులన్న కేంద్ర మంత్రి
భారతదేశం 2047 నాటికి సంకల్పించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో మన ఖనిజరంగం పాత్ర అత్యంత కీలకమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా బొగ్గు, గనుల రంగంలో సానుకూల మార్పులు కనబడుతున్నాయన్నారు. గురువారం దిల్లీలో ఎంజిఎంఐ(మైనింగ్, జియాలజికల్, మెటలర్జికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో.. గనులరంగంపై జరిగిన జాతీయ సదస్సులో విశిష్ట అతిథిగా పాల్గొన్న కేంద్రమంత్రి మాట్లాడుతూ..గనుల రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, వాటిని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల గురించి వివరించారు.
భారతదేశపు తలసరి విద్యుత్ వినియోగం ప్రపంచ సగటుతో పోల్చుకుంటే.. మూడోవంతుగా ఉందన్న కేంద్ర మంత్రి..భారతదేశంలో పెరుగుతున్న పారిశ్రామికీకరణ, అభివృద్ధి కారణంగా రానున్న రోజుల్లో ప్రపంచ సగటును భారత్ చేరుకోవడం ఖాయమన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో విద్యుదుత్పత్తిని పెంచేందుకు బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో గనుల తవ్వకం విషయంలో..మొదటి దశ అయిన ఎక్స్‌ప్లొరేషన్ పక్రియలో రిస్క్ తీసుకునేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఎక్స్‌ప్లొరేషన్ పక్రియలో 50 శాతం ఖర్చును భరించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు. గనుల రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు ఇలాంటి నిర్ణయాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
బలమైన, సమర్థవంతమైన గనుల రంగాన్ని ఏర్పాటు చేసుకోకుండా.. భారత దేశం ఆత్మనిర్భరత సాధించడం సాధ్యం కాదన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాటలను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేస్తూ.. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని సాధ్యమైన చర్యలు చేపడుతుందన్నారు. యూపీయే ప్రభుత్వంలో గనుల కుంభకోణాన్ని దృష్టిలో ఉంచుకుని, పారదర్శకమైన పద్ధతిలో వేలం విధానాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ కేంద్ర ప్రభుత్వం ‘క్రిటికల్ మినలర్ మిషన్’, ‘ఆఫ్ సోర్ మినరల్ బ్లాక్స్ వేలం’ వంటి సంస్కరణలు తీసుకొచ్చిన విషయాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. దీని ద్వారా కీలకమైన ఖనిజాల విషయంలో దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందన్నారు. దీనికి తోడుగా విదేశాల్లోని గనులను లీజ్‌కు తీసుకునే విషయంలోనూ ప్రగతి సాధించామన్నారు.
దేశంలో కోకింగ్ కోల్ దిగుమతిని తగ్గించేందుకు.. ‘మిషన్ కోకింగ్ కోల్’ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. 2030 నాటికి 140 మిలియన్ టన్నుల కోకింగ్ కోల్ ఉత్పత్తి ఈ మిషన్ లక్ష్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధికి, ఖనిజాల ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తూనే.. పర్యావరణ పరిరక్షణపైనా ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఖనిజరంగాభివృద్ధిలో ప్రైవేటు రంగం పాత్ర కీలకమన్నారు. క్లీన్ ఫ్యుయల్‌ను ప్రోత్సహించే దిశగా.. కోల్ గ్యాసిఫికేషన్, కోల్ బెడ్ మిథేన్ గ్యాసెస్ ఎక్స్‌ట్రాక్షన్, కోల్ నుంచి హైడ్రోజన్ ఎక్స్‌ట్రాక్ట్ చేయడం, కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ తదితర మిషన్లలో ప్రైవేటు రంగం ప్రత్యేక చొరవతీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబే, గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావ్, బొగ్గు శాఖ అదనపు కార్యదర్శలు, కోల్ ఇండియా చైర్మన్ పిఎం ప్రసాద్, ఎంజిఎంఐ అధ్యక్షుడు డాక్టర్ వీరారెడ్డితోపాటుగా బొగ్గు, గనుల రంగానికి చెందిన ప్రముఖులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రయివేటు గనుల యజమానులు పాల్గొన్నారు.
అనంతరం ఆయా సంస్థల సీఈవోలు, చైర్మన్లతో జరిగిన సమావేశంలో.. గనుల రంగం ఎదుర్కుంటున్న సమస్యలు, పరిష్కారాలు, తీసుకురావాల్సిన సంస్కరణలు తదితర అంశాలను కిషన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనుల కారణంగా వొచ్చిన సానుకూల మార్పులను గుర్తుచేశారు. అందరి సహకారంతో భారత దేశాన్ని గనులు, ఖనిజాల రంగంలో ఆత్మనిర్భర్‌గా మార్చేందుకు కృషి చేస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.