న్యూఢిల్లీ ఆగష్టు 8:అనుచితంగా ప్రవర్తిస్తూ, సభాధిపతి సూచనలను పాటించని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ను పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మిగిలిన కాలమంతా రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన మంగళవారం పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తి మాట్లాడటానికి ప్రయత్నించినపుడు రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ స్పందిస్తూ, ఏ నిబంధన ప్రకారం మాట్లాడాలనుకుంటున్నదీ చెప్పాలన్నారు. అందుకు ఒబ్రెయిన్ బదులిస్తూ, రూల్ 267 అన్నారు.ఒబ్రెయిన్, ధన్‌కర్ మధ్య సోమవారం కూడా వాగ్వాదం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీ సర్వీసెస్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వెంటనే టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీ నగర ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లు, 2023పై చర్చ సందర్భంగా సభా మర్యాదలను తలక్రిందులు చేస్తున్నారని డెరెక్‌పై ధన్‌కర్ మండిపడ్డారు.
ఒబ్రెయిన్ మంగళవారం పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తి మాట్లాడటానికి ప్రయత్నించినపుడు రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ స్పందిస్తూ, ఏ నిబంధన ప్రకారం మాట్లాడాలనుకుంటున్నదీ చెప్పాలన్నారు. అందుకు ఒబ్రెయిన్ బదులిస్తూ, రూల్ 267 అన్నారు. దీంతో ధన్‌కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రాజ్యసభ నేత పీయూష్ గోయల్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యసభ సభ్యునికి తగని విధంగా ప్రవర్తించినందుకు, సభాధిపతి పట్ల అవిధేయతను ప్రదర్శిస్తున్నందుకు, సభలో నిరంతరం గందరగోళం సృష్టిస్తున్నందుకు డెరెక్‌ను వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు.దీంతో టీఎంసీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ నుంచి వెళ్లిపోవాలని డెరెక్‌ను ధన్‌కర్ ఆదేశించారు. అనంతరం సభను మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.ఇదిలావుండగా, డెరెక్ ఒబ్రెయిన్‌ను సస్పెండ్ చేయడం కోసం ప్రతిపాదించిన తీర్మానంపై ఓటింగ్ జరగలేదు. ఈ అంశంపై తాను తుది నిర్ణయం తీసుకోవలసి ఉందని ధన్‌కర్ చెప్పారు.