A place where you need to follow for what happening in world cup

రూ. లక్ష కోట్ల సంపద మాఫియా చేతుల్లోకి..

0 7,805

  • మెటల్ మొరం గ్రావెల్ అక్రమ రవాణా
  • జీరో వ్యాపారంతో చెలరేగిపోతున్న వైనం
  • పర్యావరణానికి తీరని నష్టం
  • ప్రజారోగ్యం పట్టని పాలకులు
  • గనుల శాఖలో అక్రమాల ఘనులు
  • మాఫియాతో మిలాఖత్
  • ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి

రౌతు గుడ్డివాడైతే గుర్రం ఒంటి కాలు మీద దౌడు తీసిందనే నానుడి ఉంది. తెలంగాణలో మైనింగ్ మాఫియా పరిస్థితి ఇదే విధంగా ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిదేండ్ల కాలంలో మెటల్, మొరం, మట్టి వంటి చిన్న తరహా ఖనిజాల అక్రమ తరలింపు ద్వారానే రూ. లక్ష కోట్ల సంపద అక్రమార్కుల బొక్కసాల్లోకి పోయిందని అనధికారిక అంచనాల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వ దృష్టి మొత్తం కేవలం ఇసుక మీదే కేంద్రీకరించడంతో దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగింది. కొత్త ఇసుక విధానం ప్రకటించడంతో పాటు విధివిధానాలు ఖరారు చేయడం ద్వారా కొంత వరకూ ఇసుక అక్రమాలను అరికట్ట గలిగింది. రాష్ట్ర ఖనిజాభివృద్థి సంస్థకు ఇసుక తవ్వకాల బాధ్యతలను అప్పగించడంతో అక్రమ రవాణా చాలా వరకూ తగ్గిపోయింది. ఇదే కాలంలో ఇతర చిన్న తరహా ఖనిజాల గురించి ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో బడా కాంట్రాక్టర్ల దృష్టి మొత్తం వీటిపై మళ్ళింది.

Smuggling of Metal Morum Gravel7

రాష్టం ఏర్పడిన తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిథిలోనూ, ప్రధాన నగరాల్లోనూ నిర్మాణ రంగం పరుగులు పెడుతోంది. రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. దీనితో పాటు నీటిపారుదల, మిషన్ భగీరథ, రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణం, ఇతర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు గణనీయంగా పెరగడంతో మెటల్, చిప్స్, మొరం, మట్టి వంటి చిన్న తరహా ఖనిజాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. పెట్టుబడికి పది రెట్లు ఆదాయం పెరగడంతో మాఫియా దృష్టి వీటిపై మళ్ళింది. హైదరాబాద్ మినహా పూర్వపు తొమ్మిది జిల్లాల పరిథిలో మెటల్, గ్రావెల్ క్వారీల లీజుల కోసం కాంట్రాక్టర్లు పైరవీలు మొదలు పెట్టారు. లీజులు పూర్తయిన క్వారీలకు కూడా మళ్ళీ కొనసాగింపు కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. లీజుల రెన్యువల్స్ రాకున్నా, పర్యావరణ అనుమతులు లేకున్నా తమ అక్రమ దందా మాత్రం ఆపలేదు. పూర్తి స్థాయిలో జీరో వ్యపారం చేస్తూ కోట్లకు పడగలెత్తారు. తొమ్మిది జిల్లాల్లో ఇటువంటి అక్రమాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. నామ మాత్రపు అనుమతులు ఉన్న క్వారీల్లో కూడా గనుల శాఖకు రాయల్టీ, లీజు మొత్తాలను చెల్లించకుండా వే బిల్లులు లేకుండానే రోజుకు వంద లారీల మెటల్, చిప్స్ అక్రమ రవాణా చేస్తున్నారు. పూర్వపు రంగారెడ్డి జిల్లా అక్రమాలకు కేంద్ర బిందువుగా మారింది. పూర్వపు ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ జిల్లల్లో చిన్న తరహా ఖనిజాల అక్రమ దంగా యధేచ్ఛగా కొనసాగుతున్నది. అక్రమ క్వారీల సమీపంలోనే స్టోన్ క్రషర్లను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల విలువ చేసే మెటల్, చిప్స్ క్రషింగ్ చేసి ఒక్కొక్క లారీకి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయల సీనిరేజి, రాయల్టీని చెల్లించడం లేదు.

Smuggling of Metal Morum Gravel

తోగ్గూడెం నుంచి ఏన్కూర్ వరకూ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం లోని తోగ్గూడెం ఆదివాసీ గ్రామ పరిథిలో కేవలం రెండు మెటల్ క్వారీలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మరో ఆరు క్వారీలకు లీజులు రెన్యువల్ కాలేదు. లీజులు రెన్యువల్ అయిన రెండు క్వారీల్లో ఒక క్వారీకి మాత్రమే పర్యావరణ అనుమతులున్నాయి. అయినప్పటికీ ఎనిమిది క్వారీల నుంచి గత నాలుగేండ్ల కాలంలో అక్రమ తవ్వకాలు కొనసాగాయి. క్వారీల సమీపంలో ఆరు క్రషర్లను ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతూ నాలుగేండ్ల కాలంలో రూ. 100 కోట్ల రూపాయల విలువ చేసే మెటల్, చిప్స్ అక్రమ రవాణా చేసి నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వీటిపై గనుల శాఖ డైరెక్టర్ స్పందించి దర్యాప్తునకు ఆదేశించడంతో తీగ లాగితే డొంక కదిలింది. డీటీఎస్ సర్వే తో పాటు క్రషర్ల వద్ద మైనింగ్ అధికారులు తనిఖీ చేసి అక్రమంగా మైనింగ్ చేసిన మెటల్, చిప్స్ గుర్తించారు. తెలంగాణ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ ప్రకారం అసలు విలువతో పాటూ ఐదు రెట్లు అపరాథ రుసుముతో కలిపి రూ. 60 కోట్లు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. మరో మూడు క్వారీలకు ఇంకా నోటీసులు ఇవ్వక పోవడం విశేషం. నోటీసులు అంది నెల రోజులు గడచినా రాయల్టీ మొత్తంతో అపరాథ రుసుమును ఇప్పటి వరకూ అక్రమార్కులు చెల్లించలేదు. డైరెక్టర్ కు ప్రభుత్వానికి అప్పీలు చేసుకుంటామంటూ జాప్యం చేస్తున్నారు. నోటీసులు అందిన తర్వాత కూడా అక్రమార్కులు మెటల్ తవ్వకాలు, క్రషింగ్, రవాణా అనధికారికంగా కొనసాగిస్తున్నారు. మైనింగ్ అధికారుల ఉదాసీన వైఖరితోటే వారి అక్రమ వ్యాపారం కొనసాగుతున్నది. ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతమైన ఏన్కూర్ మండలంలో కూడా అక్రమ క్వారీలు, క్రషర్ల వ్యవహరంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులందడంతో వీటిపై దర్యాప్తునకు ఆదేశించారు.

Smuggling of Metal Morum Gravel

కొండలు పిండి చేసి..
ప్రకృతి సిద్ధంగా ఏర్పడి పర్యావరణ సమతుల్యం కాపాడటంలో ఎంతో కీలకమైన కొండలను తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో పిండి చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని గోదావరి లోయ మొత్తం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులతో బొందల గడ్డగా మారిపోయింది. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గ్రానైట్ మాఫియా ధాటికి కొండలన్నీ కనుమరుగై పోతున్నాయి. మిగిలిన కొన్ని కొండలపై మెటల్ మాఫియా కన్నేసి కరగ తీస్తున్నది. కొండలు కరిగి పోవడం పర్యావరణ విధ్వంసంగా పర్యావరణ వాదులు అభివర్ణిస్తున్నారు. మెటల్ క్వారీల వద్ద ఏర్పాటు చేసిన క్రషర్ల నుంచి వచ్చే రజనుతో సమీప గ్రామాల ప్రజలు ఊపిరి తిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారు. పర్యావరణ అనుమతులు జారీ చేసి చేతులు దులుపు కునే సంస్థలు కానీ కాలుష్య నియంత్రణ మండలి కానీ వాటి గురించి ఆ తర్వాత పట్టించు కోక పోవడం వెనుక అవినీతి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. పర్యావరణ అనుమతులు లేకుండా నడుస్తున్న క్వారీలు, క్రషర్లను సీజ్ చేయక పోవడం వెనుక కూడా అవినీతే కారణమనే విమర్శలు వినవస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లా పరిథిలో వందల సంఖ్యలో క్రషర్లు వెలిశాయి. వీటిలో సగానికి పైగా అక్రమంగా నడుస్తున్నాయి. ఇవి ప్రముఖ నిర్మాణ సంస్థలవి కావడంతో వాటి జోలికి అధికార యంత్రాంగం వెళ్ళడానికి సాహసించడం లేదు. రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్ మెట్ మండలంలో భారీ సంఖ్యలో మెటల్ క్వారీలు, క్రషర్లు పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్నా అక్కడ మరి కొన్ని అనుమతులను ఇవ్వడానికి ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. మెటల్ క్వారీలను, క్రషర్లను సమీప గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే తాము ఎన్జీటీలో కేసులు వేశామని, అవి విచారణ దశలో ఉండగా కొత్తవి మంజూరు చేయడానికి ప్రయత్నించడాన్ని వారు వ్యతిరేకించారు.

నిజామాబాద్ కేసులో ఎన్జీటీ కీలక తీర్పు…
నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు నిజామాబాద్ రైల్వే లైన్ పనుల కోసం మొరం, మట్టిని అక్రమంగా తరలించిన కేసులో జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలకమైన తీర్పును వెలువరించింది. గనుల శాఖ అనుమతి లేకుండా రైల్వే కాంట్రాక్టర్ ప్రభుత్వ, పట్టా భూములతో పాటు చెరువుల్లో కూడా కోట్లాది రూపాయల విలువ చేసే గ్రావెల్, మట్టిని అక్రమంగా తరలించారు. దీనిపై ‘రేలా’ స్వచ్ఛంద సంస్థ ఎన్జీటీని ఆశ్రయించగా ఐదెకరాల లోపు చేసే చిన్న తరహా ఖనిజాల మైనింగ్ కి కూడా పర్యావరణ అనుమతులు తీసుకోవాలని తీర్పును ఇచ్చింది. కేటగిరి బి ప్రాజెక్టుల కింద జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా పర్యావరణ కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిజామాబాద్ రైల్వే కాంట్రాక్టర్ చేసిన అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని మైనింగ్ శాఖను ఆదేశించడంతో అసలు విలువతో పాటు ఐదు రెట్లు అపరాథ రుసుముతో కలిపి రూ. 29 కోట్లు చెల్లించాలని ఆ శాఖ ఏడీ డిమాండ్ నోటీసులను జారీ చేశారు. రాజకీయ ఒత్తిడితో అపరాథ రుసుమును తగ్గిస్తూ అప్పటి మైనింగ్ శాఖ డైరెక్టర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిపై ‘రేలా’ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర హై కోర్టులో వేసిన ‘పిల్’ విచారణలో ఉంది.

సెక్షన్ 35 ఎ కు వక్రభాష్యం..
తెలంగాణ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ లోని సెక్షన్ 35 ఎ కు గనుల శాఖ ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వక్రభాష్యం చెప్తున్నది. దొంగలకు అనుకూలంగా ఈ సెక్షన్ ను అన్వయిస్తూ ఐదు రెట్ల అపరాథ రుసుమును ఒక రెట్టుకు తగ్గిస్తున్నది. కరీంనగర్ జిల్లాలో జరిగిన భారీ గ్రానైట్ కుంభ కోణంలో అక్రమార్కులు అపరాథ రుసుముతో చెల్లించాల్సిన రూ. 790 కోట్లు కేవలం రూ. 160 కోట్లకు తగ్గించడానికి సెక్షన్ 35 ఏ ను వినియోగించుకున్నది. లీజుల విషయంలో డైరెక్టర్ కు కానీ, ప్రభుత్వానికి కానీ అప్పీల్ చేసుకునే వెసులు బాటును మాత్రమే ఈ సెక్షన్ ప్రకారం కల్సించారు. అక్రమ మైనింగ్ చేసిన వారికి విధించే అపరాథ రుసుమును తగ్గించే అధికారం ఈ సెక్షన్ ప్రకారం లేదని ఇప్పటికే పలువురు హై కోర్టులో సవాలు చేశారు. తోగ్గూడెం, సుజాతనగర్ అక్రమార్కులతో పాటు రాష్టంలోని తొమ్మిది జిల్లాల్లో అక్రమ మైనింగ్ చేసే వారు కింది స్థాయి అధికారులు విధించే అపరాథ రుసుము చెల్లించకుండా అప్పీలు పేరుతో పైరవీలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి బారీగా గండి కొడుతున్నారు.

కొండూరి రమేష్ బాబు

Leave A Reply

Your email address will not be published.