రైతులను మోసం చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్సులు రద్దు..బ్లాక్ లిస్ట్
రైతులు ఒకటి, రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మార్కెట్‌కు తేవాలి
క్షేత్ర స్థాయిలో అధికారుల నిరంతర పర్యవేక్షణతో సజావుగా కొనుగోళ్లు
ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై చర్యలు
మంత్రులు ఉత్తమ్, పొంగులేటితో కలిసి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష
వేసవిలో తాగునీటికి ఇబ్బంది రావొద్దు ..
రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా రాబోయే రెండు నెలలు మరింత కీలకమని సీఎం అప్రమత్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అప్పటి కంటే భూగర్భ జల మట్టం పడిపోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఫిర్యాదు వొచ్చినా వెంటనే అక్కడ తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. ఏ రోజుకారోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారధ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు తాగునీటి ఇబ్బందులున్న చోటికి స్వయంగా వెళ్లి పరిశీలించాలని, అక్కడ సమస్యను పరిష్కరించే చర్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు.