- రాష్ట్రాన్ని కోఠిలో అమ్ముతానా
- నా కాలి గోటిని కూడా కొనలేవు
- బంగారు తెలంగాణ కాదు.. బెల్టుషాపుల రాష్ట్రం
- మెదక్ ఎన్నికల సభలో రేవంత్‌రెడ్డి ఫైర్
కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు (కేసీఆర్) అంటేనే ‘కచ్రా’ అనే పదం ఇమిడి ఉంది…. రేటెంతరెడ్డి అంటూ… కోఠిలో రాష్ట్రాన్ని అమ్ముతానంటూ విమర్శించిన కేసీఆర్ నాకాలి గోటిని కూడా కొనలేవని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం సాయంత్రం మెదక్ రాందాస్ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్చ్ మాణిక్ రావు ఠాక్రేతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని బెల్టుషాపుల రాష్ట్రంగా మార్చాడని, బడికెళ్లే పిల్లలు సైతం బీరుబాటిల్ ఎత్తే పరిస్థితి దాపూరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బలయ్యారు.
తెలంగాణలో అనేక మంది బలిదానాలకు చలించి గుండె కోత తెలిసిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా, నీళ్లు, నిధులు, నియామకాలు, హామీలు అమలు చేయకుండా కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. కాళేశ్వరం పాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. మేడిగడ్డ నిర్మాణంలో కేసీఆర్ అవినీతి బట్టబయలైందన్నారు. అసాంఘిక శక్తులు బాంబులు పెట్టడంతోనే కృంగిందనడం సిగ్గుచేటన్నారు. బాంబులు పెడితే పేలిపోతుందనే విషయం చిన్న పిల్లలకు కూడ తెలుస్తది, 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ జ్ఙానం ఇదేనా అని ప్రశ్నించారు. తెలంగాణకు పట్టిన దరిద్రం వదలాలంటే బీఆర్‌ఎస్‌ను ఓడించి, కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. తద్వారా అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీకోసం కష్టపడే ప్రతి నాయకులకు త్యాగాలను గుర్తించి భవిష్యత్తులో తగిన రీతిలో గుర్తింపు ఇస్తామన్నారు.
ఇక బై బై కేసీఆర్ నినాదం మెదక్ నుండే ప్రారంభం
బై బై కెసిఆర్ అంటూ రేవంత్ రెడ్డి నినాదంమిచ్చారు. కార్యకర్తల్లో ఉత్సాహం పెంచేందుకు రేవంత్‌రెడ్డి బైబై కేసీఆర్ అంటూ నినాధం చేయగా… కార్యకర్తలు హోరరెత్తించగా సభా ప్రాంగణం దద్దరిల్లింది. ప్రతిరోజు మూడు పూటలా ఇలా నినాదం చేయాలని కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కాంగ్రెస్ అభ్యర్థులు రోహిత్, రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి సుప్రభాత్‌రావు, ఎంపిపి చందన ప్రశాంత్‌రెడ్డి, నరేందర్, జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు.