- హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు
- అకస్మిక వరదలతో భయాందోళనలో ప్రజలు
- జమ్మూ కశ్మీర్ ల్లో నలుగురి మృతి
- ఉత్తరాఖండ్ లో గంగానదిలో పడిన కారు… ముగ్గురి మృతి
- హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు ఐదుగురి బలి
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలకు దోడా ప్రాంతంలో కొండచరియలు బస్సుపై పడగా, ఇద్దరు మృతి చెందారు. పూంచ్ సెక్టార్ లోనూ విషాదం నెలకొంది. హఠాత్తుగా వరద నీరు దూసుకురావడంతో ఇద్దరు జవాన్లు గల్లంతయ్యారు. వీరి మృతదేహాలు నేడు లభ్యమయ్యాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వర్షబీభత్సం నెలకొంది. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలకు గంగా నది ప్రమాదకర రీతిలో ప్రవహిస్తోంది. గంగా నదిలో ఓ కారు పడిపోయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి జాడ తెలియరాలేదు.
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. పర్యాటక ప్రదేశం మనాలీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడి వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. మండీ జిల్లాలోని బియాస్ నదిపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. హిమాచల్ ప్రదేశ్ లోని 700 రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు రెండ్రోజులు పాటు సెలవులు ప్రకటించారు. కాగా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్ లో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ చెబుతోంది. ఆ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.