- అదానీని కాపాడడం కోసమే ట్యాపింగ్
- కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
న్యూ దిల్లీ, అక్టోబర్ 31 : విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అదానీని కాపాడడం కోసమే కేంద్రం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని, ఆపిల్ నుంచి వొచ్చిన ఈమెయిల్స్ ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వంలో నెంబర్‌వన్‌గా అదానీ మారిపోయారని మండిపడ్డారు రాహుల్. అదానీ ఆదేశాలను ప్రధాని మోదీ, అమిత్‌షా పాటిస్తున్నారని ఆరోపించారు. ఫోన్లు హ్యాక్ అవుతున్నాయంటూ అసదుద్దీన్ ఒవైసీ, కేసీ వేణుగోపాల్, మహువా మొయిత్రా, శశి థరూర్, సీతారాం ఏచూరి, రాఘవ్ చడ్డాకు ఆపిల్ నుంచి ఈమెయిల్ రాగా ఈ మెయిల్స్‌ను స్క్రీన్‌షాట్లుగా పెట్టి ఎంపీలు ట్వీట్ చేశారు. దీనిపై స్పందిస్తూ కేంద్రం తమపై నిఘా పెట్టిందని విపక్ష ఎంపీలు ఆరోపించారు.
మరోవైపు పలువురు జర్నలిస్టులకు కూడా తమ ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదముందని ఆపిల్ నుంచి ఈమెయిల్ వొచ్చింది. అయితే ఈ ఇష్యూపై యాపిల్ సంస్థ స్పందిస్తూ..అలర్ట్ మెసేజ్ ఏ దేశాన్ని ఉద్దేశించి పంపలేదని..150కి పైగా దేశాల్లో తమ వినియోగదారులకు థ్రెట్ నోటిఫికేషన్లు పంపినట్లు వెల్లడించింది. కాగా..ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. తమ ఐఫోన్‌లను హ్యాక్ చేసే అవకాశం ఉందని టెక్ దిగ్గజం యాపిల్ నుంచి పలువురు పార్లమెంట్ సభ్యులకు అందిన హెచ్చరికలపై కేంద్రం విచారణకు ఆదేశించిందని విలేఖరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ఆందోళన చెందుతుందని..ఈ సమస్యపై ఆపిల్ సమాచారం అస్పష్టంగా ఉందని పేర్కొన్నారు.