న్యూ డిల్లీ జూలై 22:బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధం విధించిన నేపథ్యంలో అమెరికాలో తెలుగు ప్రజలు తీవ్ర తంటాలు పడుతున్నారు. బియ్యం కొనేందుకు పలు షాపుల వద్ద ఎన్నారైలు క్యూ కట్టారు. కొన్ని చోట్ల అయితే బియ్యం కోసం ఎన్నారైలు ఎగబడ్డారు. ఒకేసారి పదుల సంఖ్యలో బియ్యం బ్యాగులు కొనుగోలు చేస్తున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం ఎప్పుడు ఎత్తేస్తుందోనన్న భయంతో అవసరానికి మించి కూడా కొందరు ఎన్నారైలు బియ్యం కొనుగోలు చేయడంతో ఈ పరిస్థితి దాపురించింది.ఈ పరిస్థితిని గమనించిన దుకాణదారులు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు.
ఒక్కరికి ఒక్క బియ్యం బ్యాగ్ మాత్రమే విక్రయిస్తామని బోర్డుల్లో రాసిపెట్టారు. 15 డాలర్ల విలువ చేసే కిరాణ సామాన్లు కొంటేనే బియ్యం బ్యాగు కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒక కస్టమర్‌ను ఒక్కసారి మాత్రమే షాపులోకి అనుమతిస్తామని చెప్పారు. సోనా మసూరిలో ఏ రకం బియ్యం తీసుకున్నా.. ఒక్క కుటుంబానికి ఒక్క బియ్యం బస్తా మాత్రమే విక్రయిస్తామన్నారు. బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధం విధించింది. పండగలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నది. దేశీయంగా సరఫరాను పెంచే లక్ష్యంతో నిర్ణయం తీసుకోగా.. రిటైల్ ధరలు అదుపులో ఉండనున్నాయి. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. బాస్మతియేతర ఉస్నా బియ్యం, బాస్మతి బియ్యం ఎగుమతి విధానంలో ఎలాంటి మార్పు ఉండదు.
దేశం నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం బియ్యంలో బాస్మతీయేతర బియ్యం వాటా 25శాతం.2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి సన్న బియ్యం మొత్తం ఎగుమతి 4.2 మిలియన్ల డాలర్లకు చేరువలో ఉన్నది. అంతకుముందు సంవత్సరంలో ఎగుమతులు 26.2 మిలియన్లు డాలర్లుగా ఉండేది. భారతదేశం ప్రధానంగా థాయ్‌లాండ్, ఇటలీ, స్పెయిన్, శ్రీలంక, అమెరికాకు సన్న బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో ఖరీఫ్‌లో పంటల ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బియ్యాన్ని కొద్దిరోజుల పాటు నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. మరో ఇప్పటికే టమాట, పచ్చిమిర్చీ సహా పలు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.