- సహచర మంత్రులతో ప్రధాని మోదీ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం
- భారత్‌కు 2047 అమృతకాలమని వ్యాఖ్య
- అప్పటికల్లా భారత్ పలు రంగాల్లో దూసుకుపోయేలా లక్ష్యాన్ని పెట్టుకోవాలని మంత్రులకు సూచన
- వచ్చే 25 ఏళ్లలో భారత్ అభివృద్ధికి ప్రణాళికలు వివరించిన వివిధ మంత్రిత్వ శాఖల సెక్రెటరీలు
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సోమవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్‌లో కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులను ఉద్దేశించి ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. 2047లో భారత్ స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి అనేక రంగాల్లో దేశం అభివృద్ధి సాధించేలా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు.
2024 ఎన్నికలకు ఆవల ఉన్న లక్ష్యాలపై దృష్టి సారించాలని పిలుపు నిచ్చారు. 2047వ సంవత్సరం దేశానికి అమృతకాలమని మోదీ వ్యాఖ్యానించారు. రాబోయే 25 ఏళ్లలో దేశంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయని, ఉన్నత విద్యావంతులైన కార్మికగణం రంగ ప్రవేశం చేస్తుందని చెప్పారు. వివిధ రంగాలు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సహా వివిధ మంత్రిత్వ శాఖల సెక్రెటరీలు ప్రసంగించారు. రాబోయే 25 ఏళ్లలో భారత్‌ను ప్రగతి పథంలో నడిపేందుకు ఉద్దేశించిన ప్రణాళికలను ప్రధాని ముందుంచారు.
సమావేశం అనంతరం మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన సహచర మంత్రులతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. సమావేశం ఫలప్రదమైందని వ్యాఖ్యానించిన మోదీ, వివిధ విధానపరమైన అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు.