- రాంగ్ సిగ్నలింగ్ వల్లే రైలు ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడి
- గతంలోని ప్రమాదాల నుండి పాఠాలు నేర్చుకుంటే ప్రమాదం తప్పేదని అభిప్రాయపడిన రైల్వే సేఫ్టీ విచారణ కమిటీ
- నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించిన విచారణ కమిటీ
ఒడిశాలోని బాలేశ్వర్‌లో గత నెలలో జరిగిన ట్రిపుల్ ట్రైన్ ప్రమాదానికి గల కారణాలను విచారణ కమిటీ సోమవారం వెల్లడించింది. రైల్వే సేఫ్టీ విచారణ కమిటీ ఈ నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది. రాంగ్ సిగ్నలింగ్ వల్లే ఈ రైలు ప్రమాదం చోటు చేసుకుందని నివేదికలో పేర్కొంది. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు జరిగాయని, వాటి నుండి పాఠాలు నేర్చుకొని ఉంటే ఈ ప్రమాదం తప్పేదని అభిప్రాయపడింది. దీంతో పాటు పలు లోపాలను గుర్తించినట్లు తెలిపింది.
రాంగ్ వైరింగ్, రాంగ్ కేబుల్ వల్ల 2022 మే 16న ఇదే తరహా దుర్ఘటన ఖరగ్‌పూర్ డివిజన్ లో చోటు చేసుకుందని పేర్కొంది. అప్పుడే దీనిని సరిచేసే చర్యలు చేపట్టి, రాంగ్ వైరింగ్ సమస్యను పరిష్కరించి ఉంటే ఈ దుర్ఘటన చోటు చేసుకొని ఉండేది కాదని పేర్కొంది. సిగ్నలింగ్, సర్క్యూట్ మార్పులో లోపాలే ప్రమాదానికి కారణమని తెలిపింది.