తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ ఓటు బ్యాంకులపై దృష్టి సారించాయి. బీసీల ఓట్లను గంపగుత్తగా సాధించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో పెరిగిన జోష్ ఆ పార్టీ మరింత పదునుగా, పకడ్బందీగా అమలు చేయడానికి వ్యూహాలను రూపొందిస్తోంది. అదే కర్నాటక ఎన్నికల ఫలితం బీజేపీని దిగాలు పడేలా చేసింది. తెలంగాణలో పాగా వేయడం ఖాయమన్న స్థాయి నుంచి.. ఉన్న బలాన్ని, పరపతిని నిలుపుకుంటే చాలన్నట్లుగా ఆ పార్టీ రాష్ట్ర శ్రేణులు చతికల బడ్డాయి. దీంతో అధిష్ఠానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్ర నాయకులలో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కర్నాటకలో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా తెలంగాణలో మరింత పకడ్బందీగా అధికారమే లక్ష్యంగా అడుగులు వేయాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగల బీసీ ఓట్లపై గురి పెట్టింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకుని.. బీసీలను దరి చేర్చుకుంటే విజయం నల్లేరుమీద బండినడకే నని భావిస్తూ ఆ దిశగా పావులు కదుపుతోంది.
అయితే 2018 ఎన్నికలకు 2023 ఎన్నికలకు మధ్య పోలిక పొంతన ఉండే అవకాశం లేదని, ఈ రెండు ఎన్నికల నడుమ టీఆర్ఎస్ – బీఆర్ఎస్ లకు మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికలలో కీలకంగా నిలిచిన తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ పార్టీ పేరు మార్చడంతో ఉనికిలోనే లేకుండా పోయింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆకాంక్ష తెలంగాణ సెంటిమెంట్ ఏ పార్టీకి దక్కకుండా చేసింది. స్వయంగా ఆయన పార్టీ కూడా ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను ప్రస్తావిస్తే నవ్వుల పాలయ్యే పరిస్థితి ఉంది. తెలంగాణ తెచ్చాం అని చెప్పుకునే అవకాశం బీఆర్ఎస్ కు, తెలంగాణ ఇచ్చాం అని క్లెయిమ్ చేసుకునే చాన్స్ కాంగ్రెస్ కు లేకుండా పోయింది.
ఇక సోనియమ్మనే కాదు.. ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోండి అంటూ పర్లమెంటు వేదికగా దివంగత సుష్మా స్వరాజ్ సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందేందుకు అప్పట్లో తన శాయశక్తులా ప్రయత్నించారు ఇప్పుడు బీజేపీకి తెలంగాణ ఆవిర్భావానికి తామూ సహకరించాం అని చెప్పుకునే అవకాశం కూడా లేదు. అందుకనే రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారిగా తెలంగాణ నినాదం లేకుండా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సెంటిమెంట్ ను ఉపయోగించుకుని ఇంతవరకు గరిష్ట ప్రయోజనం పొందిన బీఆర్ఎస్( టీఆర్ఎస్) రానున్న ఎన్నికలలో ఆ కారణంగానే గరిష్టంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషించాలన్న ఆకాంక్షతో రూటు మార్చిన కేసీఆర్.. చేజేతులా తెలంగాణ తెచ్చిన పార్టీగా, నేతగా బీఆర్ఎస్ కు ఉన్న గుర్తింపును తుడిచేశారు. ఈ నేపథ్యంలో 2023 ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త వరవడికి, కొత్త అధ్యాయానికి తెర తీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు కులం కార్డును తెరమీదకు తీసుకువచ్చాయి. ముఖ్యంగా బీసీ కార్డు తురఫు ముక్కగా మార్చుకుని విజయసోపానాలు అందుకోవాలని చూస్తున్నాయి. బీజేపీ తెలంగాణలో ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించింది.
అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా, నామినేటెడ్ పదవుల్లో పెద్ద పీట, బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేయడంతో పాటు పల్లెపల్లెకూ బీసీ- ఇంటింటికీ బీజేపీ’ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారమూ ఆరంభించింది. బీజేపీ ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే.. రాజకీయ చాణుక్యుడిగా పేరుపొందిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అధికార బీఆర్ఎస్ మరోలా ముందుకెళ్తోంది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా బీసీలలో వెనకబడిన కులాలకు లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా బీసీ నినాదంతో రాబోతుంది. తెలంగాణలో బీసీ పాలసీ తీసుకొస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. త్వరలోనే రాష్ట్రంలో బీసీ గర్జన సభ పెడతామని ప్రకటించారు.రాష్ట్ర జనాభాలో బీసీ జనాభా అధికంగా ఉండడంతో సహజంగానే అన్ని పార్టీలు బీసీ ఓటు మీద కన్నేసి, బీసీలను తమవైపు తిప్పుకునేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. నిజానికి, తెలంగాణలో ఇంతవరకు బీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనారిటీ వరాలు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయా సామాజికవర్గాలు మరీ ముఖ్యంగా బీసీలు ఎటు మొగ్గుచుపుతారు, అనేది గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.