A place where you need to follow for what happening in world cup

చేతికి పతంగ్ అందుతుందా…

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొత్త ఎత్తులతో.. పాత పొత్తులకు పదును పెడుతోంది తెలంగాణ కాంగ్రెస్‌. గతంలో ఆత్మీయులుగా ఉండి… కాలక్రమంలో, మారిన రాజకీయ పరిణామాలతో దూరమైన మిత్రులను తిరిగి దరి చేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కొన్ని రహస్య సమావేశాలు కూడా జరుగుతున్నట్టు ప్రచారం ఉంది. దశాబ్దాల తరబడి కాంగ్రెస్‌ పార్టీకి సహజ మిత్రుడు ఎంఐఎం. 2014 ఎన్నికల నుంచి రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. కానీ.. ఇప్పుడు, మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో తిరిగి పాత దోస్తీని పునరుద్ధరించుకునే పనిలో ఉన్నట్టు తెలిసింది. గాంధీభవన్‌ నాయకత్వమే అందుకు చొరవ తీసుకుందని, ఆ దిశగా హైదరాబాద్‌లో పావులు కదులుతున్నాయని చెప్పుకుంటున్నారు.అదే సమయంలో.. అధికార పార్టీతో చెట్ట పట్టాలేసుకుని తిరుగుతున్న ఎంఐఎం.. క్లారిటీ లేని కాంగ్రెస్ పార్టీతో తిరిగి జత కడుతుందా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. అయిననూ పోయి రావలె.. అన్నట్టుగా టి కాంగ్రెస్‌ తన ప్రయత్నాల్లో తాను ఉందట.

ఎన్నికల్లో తమతో కలిసివచ్చే మిత్రుల కోసం అన్వేషిస్తున్న గాంధీభవన్‌ అతి ముఖ్యనేత ఒకరు తాజాగా ఎంఐఎం అధినేతతో భేటీ అయ్యారట. దానికి ముందు ఆ అతి ముఖ్యనేత కాంగ్రెస్‌ పార్టీలోనే పెద్దలుగా చెప్పుకునే ముఖ్య నేతతో సమావేశమై కీలక చర్చలు జరిపినట్టు తెలిసింది. బుధవారం రాత్రి పొద్దు పోయాక ఎంఐఎం అధినేతతో కాంగ్రెస్‌ కీలక నేత సమావేశమైనట్టు సమాచారం.. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏం చర్చించారు..? రాజకీయంగా కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పనిచేసే అవకాశం ఉందా ? ఇప్పటికే కేసీఆర్‌తో మిత్రుత్వం ఉన్న ఎంఐఎం.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటుందా అన్న ప్రశ్నలు పొలిటికల్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా.. ఎంఐఎం మా మిత్రపక్షమే.. వచ్చే ఎన్నికల్లో కూడా మాతోటే ఉంటుందని స్పష్టత ఇచ్చారు కేసీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కి చెందిన అతి ముఖ్యమైన నేత ఎంఐఎం ముఖ్యలతో సమావేశం కావడంపై హాట్‌ హాట్‌గా చర్చ జరుగుతోంది.

అదే సమయంలో మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా పెట్టిన ఇండియా కూటమిలో చేరమని ఎంఐఎం నేతల్ని అడగడానికి వెళ్ళారన్నది ఆ వార్తల సారాంశం. మరి ఇండియా కూటమిలో చేరడానికి మజ్లిస్‌ నాయకత్వం ఆసక్తిగా ఉందా? ఒకవేళ చేరినా… తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉందా అన్న ప్రశ్నలకు మాత్రం ప్రస్తుతానికి సమాధానం లేదు. ఎంఐఎంతో కలిసి పని చేస్తే.. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు నాలుగైదు జిల్లాల్లో కాంగ్రెస్‌ కలిసిచ్చే అవకాశం ఉంది. అందుకే… మజ్లిస్‌తో ఫ్రెండ్‌షిప్‌ పునరుద్ధరణకు టి కాంగ్రెస్‌ నేతలు ఆరాటపడుతున్నారట. అయితే..ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కి దూరమైన ఎంఐఎం ఇప్పుడు కలిసి రావడానికి బలమైన కారణం ఏముంది ..? అన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ పరిణామాలపై అటు అధికార పార్టీ కూడా నజర్ పెట్టినట్టు సమాచారం. భేటీకి వెళ్ళిన నాయకులు మాత్రం అసలేం జరగనట్టే వ్యూహాత్మక మౌనం పాటిస్తుండటంతో… సస్పెన్స్‌ పెరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏ పార్టీ ఎలాంటి ఎత్తుగడని వేస్తుందోనన్న ఆసక్తి పెరుగుతోంది. ఎంఐఎం నేతలు కూడా ఎన్నికల దాకా మౌనం పాటించి సస్పెన్స్‌ పెంచుతారా? లేక త్వరలోనే కుండబద్దలు కొట్టేస్తారా అన్నది చూడాలి.

Leave A Reply

Your email address will not be published.