- చెక్కులను అన్ని బ్యాంకులలో చెల్లుబాటు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి……
- పి ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి డిమాండ్…..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొదుపు సంఘాలకు ఇచ్చిన చెక్కులకు బ్యాంకులలో డబ్బులు లేవని చెప్పడం దురదృష్టకరమని పి ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి అన్నారు. సోమవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలో ఇంటింటికి వెళ్లి పొదుపు సంఘాల మహిళలను రాష్ట్ర ప్రభుత్వం చేసే మోసాన్ని బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తమ సంఘాలలో తీసుకున్న రుణాలకు చెల్లించిన వడ్డీని తిరిగి చెల్లించేదుకు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బ్యాంకులలో జమ చేసిన మహిళలకు బ్యాంకు సిబ్బంది ఇందులో డబ్బులు లేవని చెబుతున్నారని తెలిపారు. డబ్బులు వేయకుండా పొదుపు సంఘాల మహిళలను రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి మోసం చేస్తుందని ఆరోపించారు.
పొదుపు మహిళలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గుర్తించి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పొదుపు మహిళలు తీసుకున్న రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మహిళకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పెన్షన్ సౌకర్యం అమలు చేస్తూ అభయస్థాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. దసరా పండుగకు రెండువేల రూపాయల బోనస్ సౌకర్యం కల్పించాలని సూచించారు. లేకుంటే రానున్న ఎన్నికలలో మహిళల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మరికల్ గోపాల్. నాయకులు బొడ్డుపల్లి కాడయ్య. జంగిలి యాదయ్య. శ్రావణ్. ప్రదీప్ తో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…..