- టాస్క్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా కు సర్వం సిద్దం
- సూర్యాపేట లోని సదాశివ రెడ్డి ఫంక్షన్ హాల్లో జాబ్ మేళా కు పూర్తయిన ఏర్పాట్లు
- ఉదయం 9: 00నుండి 5:00 గంటల వరకు కొనసాగనున్న నియామక ప్రక్రియ
- తొలి విడుతలో 300 నుండి 400 మంది ఉద్యోగాల భర్తీ
- రూ.2లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్యాకేజీ
- ముందుకు వవచ్చిన 17 ఐటీ యాజమాన్యాలు
- జాబ్ మేళా లో పాల్గొనేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న 4వేల మంది విద్యార్థులు
- రెండో వారంలో ఐటీ హబ్ ప్రారంభోత్సవం!
- నెరవేరనున్న మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల వాగ్దానం
అనతి కాలంలోనే ఐటీ రంగంలో అద్భుత ప్రగతి సాధించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు సూర్యాపేట జిల్లాల్లోనూ సాఫ్ట్‌వేర్ కొలువుల కల్పనకు కృషి చేస్తున్నది. ఐటీ జాబ్ అంటే బెంగళూర్‌కో, హైదరాబాద్ వరకో వెళ్లే పని లేకుండా స్థానికంగానే ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నది.
ఐటీ హబ్ అనేది బీటెక్ చదివిన ప్రతీ విద్యార్థి కల. 2018 ఎన్నికల సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ ఐటీ హబ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో ఐటి మంత్రి కేటీఆర్ సహకారం తో సూర్యాపేట జిల్లాలో పుట్టి పెరిగి ఇతర దేశాల్లోని పలు పరిశ్రమల్లో స్థిరపడ్డ వారిని మంత్రి జగదీష్ రెడ్డి అభ్యర్థించడంతో వారు ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ నిర్మించే ఐటీ హబ్ నుంచి వారిని మానిటరింగ్ చేస్తూ తమ పనులు చేయించుకొని వేతనం ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మన సూర్యాపేట యువతకు, స్థానికంగా నిర్మించిన హబ్‌లోనే కొలువులు రానున్నాయి. ఇందుకు రేపు జిల్లా కేంద్రలోని సదాశివ రెడ్డి ఫంక్షన్ హాల్లో అర్హత కలిగిన అభ్యర్థులకు ఇంటర్యూలు నిర్వహించి ఎంపిక చేసేందుకు (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ డెవలప్ మెంట్) టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సొంత గడ్డపై మమకారంతో..
ఎదిగిన కొద్ది ఒదిగి ఉండటంతోపాటు ఉన్న ఊరు కన్నతల్లిని మర్చిపోవద్దు అనేది పెద్దలు చెప్పిన మాట. దానిని మన జిల్లా పారిశ్రామిక వేత్తలు ఆచరిస్తూ స్థానిక యువత ఉద్యోగాల కల్పనకు ముందుకు వచ్చారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇతర దేశాల్లో పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదిగిన వారిని టాస్క్ గుర్తించగా వారిని కాంటాక్ట్ అయిన మంత్రి జగదీష్ రెడ్డి ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఆ మేరకు 17 కంపెనీల ప్రతినిధులుసూర్యాపేట ఐటీ హబ్‌లో ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించి జాబ్‌మేళాకు సిద్ధమయ్యారు. జాబ్ మేళాలో అభ్యర్థుల ఎంపిక జరుగనుండగా అక్టోబర్ రెండు న మంత్రి కేటీఆర్‌చే ఐటీ హబ్ ప్రారంభించనున్నారు.
ఐటీ హబ్‌లో కొలువు కొట్టాలంటే 2019 నుంచి 2023 విద్యా సంవత్సరం వరకు ఏదైనా టెక్నికల్ డిగ్రీలో 50శాతం మార్కులతో పట్టా పొంది ఉండాలి. ఆయా కంపెనీలు నిర్వహించే టెస్టుల్లో తమ పనితీరును కనబరచాల్సి ఉంటుంది. మేనేజర్ స్థాయి నుంచి టెక్నికల్ డెవలపర్ వరకు పలు హోదాల్లో ఈ ఉద్యోగాల కల్పన ఉండనుండగా ఏడాదికి కనిష్ఠంగా రూ.2లక్షల నుంచి గరిష్ఠంగా రూ.25 లక్షల వరకు ఇవ్వనున్నారు. అమెరికా నుంచి వచ్చే 17 కంపెనీల ప్రతినిధులు స్వయంగా ప్రతి అభ్యర్థిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయనున్నారు. ఎంపిక తర్వాత వెంటనే జాయినింగ్ చేసుకొని పక్షం రోజుల్లోనే విధుల్లో చేరే విధంగా ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇందులో 300 మంది తో ప్రారంభమై రెండు వేల మంది జిల్లా వాసులకే ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
యువత జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి:మంత్రి జగదీష్ రెడ్డి
మంగళవారం సూర్యాపేట లో టాస్క్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. అర్హులైన వారు హాజరై తమ ప్రతిభను చూపించి ఉద్యోగాలు పొందాలి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం ఓ వైపు సర్కారు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తూనే మరో వైపు ఇలాంటి ఉద్యోగాల కల్పన కోసం చర్యలు తీసుకుంటున్నది. ఐటి పరిశ్రమ సూర్యాపేట రావడం , ఈ ప్రాంతపు రూపు రేఖలే మారిపోనున్నాయి.. వచ్చే మూడేళ్ళలో లో హైదరాబద్ తరువాత ఐటి రంగంలో సూర్యాపేట నే అనుకునే విధంగా ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో, ఐటి రంగాన్ని అభివృద్ధి చేస్తాను.