-
కాంగ్రెస్ నేతలతో షర్మిల సంప్రదింపులు నిజం కాదన్న జానారెడ్డి
-
తాను కూడా మాట్లాడలేదని వెల్లడి
-
ఇలాంటి మధ్యవర్తిత్వాలు చేయనన్న సీనియర్ నేత
కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరుతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. చర్చలు కొలిక్కి వచ్చాయని, షర్మిల కొన్ని కండిషన్లు పెట్టారని, ఇవాలో రేపో చేరిపోతారని జోరుగా ఊహాగానాలు సాగాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో రెండుగా విడిపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోందని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో జానారెడ్డితో షర్మిల చర్చించినట్లు, రాహుల్ గాంధీ వద్దకు జానారెడ్డితో రాయబారం పంపినట్లు ప్రచారం సాగింది. దీనిపై పీసీసీ చేరికల కమిటీ ఛైర్మన్ కె.జానారెడ్డి తీవ్రంగా స్పందించారు. షర్మిల తనతో మాట్లాడినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతలతో షర్మిల సంప్రదింపులు నిజం కాదని జానారెడ్డి అన్నారు. ‘‘షర్మిల నాతో మాట్లాడినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. పార్టీ నాకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే. ఆ పని మాత్రమే చేస్తా. ఇలాంటి మధ్యవర్తిత్వాలు చేయను” అని స్పష్టం చేశారు.