హైదరాబాద్, ఆగస్టు 2:హైదరాబాద్ నుంచి మరో వందేభారత్ పరుగులు పెట్టనుంది. ఇప్పటికే విశాఖ, తిరుపతి మధ్య సికింద్రాబాద్ నుంచి వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మూడో రూట్‌లో ఉరుకులు పెట్టేందుకు రెడీ అయ్యింది. చెన్నై కోచ్ ఫ్యాక్టరీ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది కొత్త వందే భారత్ ట్రైన్. ఐటీ పరంగా దేశంలోనే దిగ్గజ నగరాలుగా పేరుగాంచిన హైదరాబాద్-బెంగళూరు మధ్య వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. అలాగే, కాచిగూడ-యశ్వంతపూర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ బుల్లెట్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వేకు మూడో వందేభారత్ సర్వీసుగా అందుబాటులోకి రానున్న ఈ రైలు సేవలు.. ఆగస్టు 6న కానీ, 15న కానీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజనల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ వందేభారత్ రైలు ప్రారంభోత్సవాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణ సమయం దాదాపు 11 గంటలు పడుతోంది. ఈ వందేభారత్ ట్రైన్ సేవలుు ప్రారంభమైతే.. కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే బెంగుళూరు చేరుకోవచ్చు. కాచిగూడలో ఉదయం ఆరుగంటలకు బయలుదేరి మధ్యాహ్నం రెండున్నర వరకు బెంగుళూరు చేరుకుని, తిరిగి అక్కడ 3 గంటలకు బయలు దేరి రాత్రి పదకొండున్నరకు కాచిగూడ చేరుకునే అవకాశం ఉంది. ఇక..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేభారత్ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య గత జనవరిలో ప్రారంభమైంది.ఆ తర్వాత తిరుపతికి మరో రైలును ప్రారంభించారు. ఈ రైళ్లు పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. వేగంగా గమ్య స్థానాలకు చేరుకునే వీలుండటంతో వందే భారత్ రైళ్లకు ఆదరణ లభిస్తోంది. కాచిగూడ- యశ్వంతపూర్ మధ్య ప్రవేశపెడుతున్న వందేభారత్ రైలుతోనూ ఈ మార్గంలో ప్రయాణించేవారు వేగంగా గమ్య స్థానానికి చేరుకునే వీలుంటుంది.