A place where you need to follow for what happening in world cup

కాంగ్రెస్ లో హిందుత్వ అజెండా….

0 67

సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో బీజేపీ హిందుత్వ కార్డును ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కూడా కాషాయ మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. కొన్ని పరిణామాలు చూస్తుంటే.. అవుననే అనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో యోగి నేతృత్వంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు.. అక్కడి కాంగ్రెస్ నేతలు హిందుత్వ మార్గాన్నే అనుసరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా అజయ్ రాయ్ నియమితులయ్యారు. ఆగస్టు 24న రాష్ట్ర అధ్యక్షుడిగా అజయ్ రాయ్ బాధ్యతలు స్వీకరించారు. లక్నోలోని యూపిఎస్సీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించేముందు కాంగ్రెస్ పార్టీ గంగా హారతితో పాటు వేద శ్లోకాలు పఠించడం, పూజలు చేశారు. దానికి ముందు దేవుడి అనుగ్రహం కోసం కాశీ విశ్వనాథ ఆలయాన్ని సైతం అజయ్ రాయ్ సందర్శించారు.

ఈ పరిణామాలన్ని చూస్తుంటే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే వ్యూహాత్మక ఎత్తుగడగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. హిందుత్వ ఎజెండాతో తిరుగులేని రాజకీయ పార్టీగా అవతరించిన బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కూడా అదే బాటలో పయనిస్తుందన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు.. అంతకుముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పలు ఆలయాలను సందర్శించిన సమయంలో కూడా ఇలాంటి వార్తలే తెరపైకి వచ్చాయి. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా రాహుల్ పలు ఆలయాలను సందర్శించారు. ప్రస్తుతం యూపీ కాంగ్రెస్ అవలంభిస్తున్న పరిణామాలపై బీజేపీ స్పందించింది. ఎన్నికలకు ముందు, కాంగ్రెస్ తమకు కూడా హిందూ పూర్వాపరాలు ఉన్నాయని నొక్కిచెప్పడానికి ప్రయత్నిస్తుందంటూ బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు.రాజకీయ విశ్లేషకులు కూడా ఇది ఎన్నికల స్టంట్ గానే భావిస్తున్నారు.

కాంగ్రెస్ తరచుగా మైనారిటీల పట్ల మృదువుగా వ్యవహరిస్తోందన్న బీజేపీ ఆరోపణలతో.. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకిగా గుర్తింపు పొందిందని, అందువల్ల కాంగ్రెస్ తన ప్రతికూల ఇమేజ్‌ను ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేస్తుందని బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ, రాజకీయ వ్యాఖ్యాత ప్రొఫెసర్ సుశీల్ పాండే.. ఓ న్యూస్ ఛానెల్ తో పేర్కొన్నారు.ఈ చర్యను రాజకీయాల కోణంలో చూడకూడదని కాంగ్రెస్ నేతలు సహజంగానే సమర్థించుకుంటున్నారు. ఈ సంఘటనలు భారతదేశంలోని జీవన విధానాన్ని తెలియజేస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు కాశీ విశ్వనాథుని భక్తుడు, దేవుడి ఆశీర్వాదం తీసుకోవడం అతని జీవితంలో ఒక భాగం.. ఇక్కడ రాజకీయాలు తగదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ హిందుత్వ ఎజెండానే ప్రధాన కారణంగా ఉంటుందని రాజకీయ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం, జ్ఞానవాపి కాంప్లెక్స్ సర్వే, మధుర కేసులో రాబోయే పరిణామాలపై బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉంది . 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో హిందుత్వ ఎజెండాలో ఇవి కీలకమైన అంశాలంటూ కొత్తగా నియమితులైన కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్నారు.త్వరలో ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటిదే కనిపిస్తోంది. తరచుగా ఆలయాలను సందర్శించే కాంగ్రెస్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్ ఇటీవల చింద్వారాలో ప్రముఖ సీర్ బాబా బాగేశ్వర్‌కు ఆతిథ్యం ఇచ్చారని.. కాంగ్రెస్ హిందుత్వ ఎజెండాలో పయనిస్తుందన్న దానికి ఇది కూడా ఒక ఉదాహరణగా పలువురు పేర్కొంటున్నారు.ఈ ఏడాది చివరి నాటికి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మిజొరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ కూడా రూటు మార్చి.. గెలుపు వ్యూహాంతో ముందుకు సాగుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Leave A Reply

Your email address will not be published.