A place where you need to follow for what happening in world cup

ఇసుక సొసైటీలకు జీఎస్టీ షాక్..

0 24,652

  • కోట్ల రూపాయలు ఎగవేస్తున్న కాంట్రాక్టర్లు
  • బిల్లులు తీసుకుని పరారవుతున్న వైనం
  • స్కామ్ లో ఉన్నతాధికారుల హస్తం
  • రిజిస్ట్రేషన్ లేకున్నా ఒప్పందాలు
  • మినహాయించకుండానే భారీ చెల్లింపులు
  • ఆలస్యంగా స్పందిస్తున్న జీఎస్టీ అధికారులు
  • నోటీసులతో ఆదివాసీల అయోమయం

ఆమె పేరు తల్లడి సమ్మక్క. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం లోని ఏటూరు గ్రామ ప్రజా ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ అధ్యక్షురాలు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆదివాసీ కుటుంబం వారిది. ఇటీవల జీఎస్టీ అధికారుల నుంచి అమెకు ఒక లేఖ వచ్చింది. ఇసుక తవ్వకాలు, రవాణా చేసినందుకు రూ. 3.4 కోట్లు జీఎస్టీ కట్టాలని దీని సారాంశం. ఒక్క సారిగా షాక్ గురైన సమ్మక్క ఐటీడీఏ అధికారుల వద్దకు పరుగు పెట్టింది. తమకేమీ తెలియదని వారు చెప్పడంతో అవాక్కయింది. 

GST notice

ఇదీ అసలు కథ…

 ఏటూరు గ్రామ ప్రజా ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీకి టీఎస్ఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు డంపింగ్ యార్డు వరకూ రవాణా, లారీల లోడింగ్ పనులను అప్పగించారు. ట్రైకార్ లేదా బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. పెట్టుబడులు లేక పోవడంతో బినామీ కాంట్రాక్టర్లకు ఇసుక తవ్వకాలను అప్పగిస్తూ సొసైటీ ఒప్పందాలను చేసుకుంది. ఇదంతా అధికారులే దగ్గరుండి నడిపించారు. క్యూబిక్ మీటర్ కు సహకార సంఘానికి రూ. 70, కాంట్రాక్టర్లకు రూ. 80 చెల్లించే విధంగా ఒప్పందాలు జరిగాయి. 2016 లో ఇసుక తవ్వకాలు ప్రారంభం కాగా రెండేండ్ల కాలంలో 68 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను కాంట్రాక్టర్లు తీసి లోడింగ్ చేశారు. ఈ మేరకు రూ. 27 కోట్లు రాగా టీడీఎస్ పోను సహకార సంఘానికి రూ. 12.7 కోట్లు, కాంట్రాక్టర్లకు 14 కోట్లు చెల్లించారు. 

ఏటూరు ఇసుక సహకార సంఘంలో 600 మంది సభ్యులుండగా ప్రతి కుటుంబానికి రూ. లక్షకు పైగా బోనస్ రూపంలో ఆదాయం వచ్చింది. అసలు కథ ఇక్కడే మొదలైంది. అప్పటికే జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కాంట్రాక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల వద్ద 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్న అధికార యంత్రాంగం ఇసుక కాంట్రాక్టర్ల వద్ద ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండానే మొత్తం చెల్లింపులు చేసింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా లేని కాంట్రాక్టు కంపెనీలకు ఇసుక తవ్వకాలను అప్పగించింది. ఈ వ్యవహారంలో అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ నిర్లక్ష్యమే కారణమని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. అమాయకులైన ఆదివాసీలకు జీఎస్టీ గురించి తెలియక పోవచ్చు. కానీ వారికి చైతన్యం కలిగించాల్సిన అధికారుల పాత్ర ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. సమ్మక్కకు జీఎస్టీ నోటీసులు అందిన తర్వాత కూడా పనులు చేసిన కాంట్రాక్టర్ల జాబితాను కానీ, వారికి చెల్లించిన బిల్లుల వివరాలను కానీ జీఎస్టీ అధికారులకు స్థానిక అధికారులు అందించలేదు.

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పు..

ఇసుక కాంట్రాక్టర్లు కూడా ఇతర వర్క్ కాంట్రాక్టర్లతో సమానంగా 18 శాతం జీఎస్టీ చెల్లించాలని జీఎస్టీ తెలంగాణ అప్పిలేట్ ట్రిబ్యునల్ 2018 లో ఇచ్చిన తీర్పులో పేర్కొన్నది. మేడిగడ్డ ఇసుక కాంట్రాక్టర్ వేసిన ముందస్తు అప్పీల్ లో ఆర్డర్ నంబర్ AAAR/02/2018 (A.R), తేది. 4.09.2018 పేరుతో తీర్పు వెలువడింది. ఇసుక కాంట్రాక్టర్లు కూలీలను పురమాయించడం, ట్రాక్టర్లు. టిప్పర్లు ప్రొక్లయినర్ల వినియోగంతో పనులు చేయడంతో జీఎస్టీ లోని సర్వీసెస్ విభాగం కింద 18 శాతం పన్ను చెల్లించాలని తీర్పులో ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.

అగ్రిమెంట్ లో టీఎస్ఎండీసీ నిబంధన…

జీఎస్టీ ట్రిబ్యునల్ తీర్పు తర్వాత తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ సహకార సంఘాలతో చేసుకుంటున్న అగ్రిమెంట్లలో జీఎస్టీ నిబంధనను పొందు పరుస్తున్నది. ఒప్పందంలోని 11 నిబంధన ప్రకారం రైజింగ్ కాంట్రాక్టర్ గా పేర్కొన్న సహకార సంఘం ఒప్పంద కాలానికి జీఎస్టీ సహా ప్రస్తుతం అమలులో ఉన్న, భవిష్యత్ లో అమల్లోకి వచ్చే అన్ని టాక్స్ లు చెల్లించాలని ఆ నిబంధనలో పేర్కొంటున్నది. రైజింగ్ కాంట్రాక్టర్ గా నిర్ణయించిన సహకార సంఘం సబ్ కాంట్రాక్ట్ కానీ థర్డ్ పార్టీ ఒప్పందాలను కానీ చేయకూడదని కూడా టీఎస్ఎండీసీ ఒప్పందంలో పేర్కొంటున్నదున జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత సహకార సంఘాసలపైనే పడుతుంది. ఈ నిబంధనలను పట్టించుకోకుండా ఐటీడీఏ

అధికారులు, సహకార సంఘాలు ఏక మొత్తంలో క్యూబిక్ మీటర్ కు రూ. 180 చెల్లిస్తామంటూ ఒప్పందాలు చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. టీడీఎస్ మినహాయిస్తున్న విధంగానే బిల్లుల మొత్తంలో జీఎస్టీ కూడా మినహాయించాలని (ఎట్ సోర్స్) జీఎస్టీ అధికారులు కోరుతున్నారు. ఈ విధంగా చేయక పోతే జీఎస్టీ చట్టం ప్రకారం సహకార సంఘాలతో పాటు కాంట్రాక్టర్లు కూడా సివిల్, క్రిమినల్ కేసులను ఎదుర్కోవలసి ఉంటుంది. జీఎస్టీ ఎగవేత దారులను జైలుకు పంపాలని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో ఆదివాసీ సహకార సంఘాలు ముందుగానే మేల్కొనడం మంచిది.

కొండూరి రమేష్ బాబు

Leave A Reply

Your email address will not be published.