- ఏజెన్సీ ఇసుక రీచ్ లపై మంత్రి హుకుం
- ఆదివాసుల పొట్ట కొట్టే యత్నం
- ప్రభుత్వ ఆదాయానికి గండి
- ఎమ్మెల్యేలపై పెరుగుతున్న వ్యతిరేకత
- సీఎం కు ఫిర్యాదుల వెల్లువ
- పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్
ఏజెన్సీ ఇసుక రీచ్ లను ఆపాలంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి హుకుం జారీ చేయడంపై ఆదివాసీ ఇసుక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణం సహా అన్ని అనుమతులు వచ్చిన భద్రాద్రి జిల్లాలోని పది ఇసుక రీచ్ లపై మంత్రి అనుచరుల కన్ను పడింది. వాటిని తమ చేతుల్లోకి తీసుకోవాలని చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో చివరికి వాటిని నిలిపివేయడానికి ప్రయత్నించి విజయం సాధించారు. పది రోజుల్లో రుతుపవనాలు వ్యాపించే అవకాశం ఉండడంతో పాటు వచ్చిన అనుమతుల కాల పరిమితి కూడా ముగుస్తున్నదని ఆదివాసీలు వాపోతున్నారు. అధికారుల వద్దకు ఎన్నిసార్లు వెళ్ళినా వారు బాహాటంగా మంత్రి పేరు చెప్పడం గమనార్హం. మంత్రి తీరుతో ఆదివాసీల ఉపాథి దెబ్బతినడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడింది.
‘పీసా’ చట్టం ప్రకారం ఏజెన్సీలో ఇసుక రీచ్ లను ఆదివాసీ సహకార సంఘాలకు కేటాయించాల్సి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బయ్యారం, మణుగూరు, అశ్వాపురం, భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో పది ఇసుక రీచ్ లను గుర్తించిన జిల్లా యంత్రాంగం అసెంబ్లీ ఎన్నికలకు ముందే పర్యావరణ అనుమతులను తీసుకున్నది. ఎన్నికల కోడ్ పేరుతో జిల్లా కలెక్టర్ ఇసుక రీచ్ ల అనుమతులను నిలిపివేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెంబర్ టూ గా ప్రచారంలో ఉన్న మంత్రి అనుచరుల కన్ను ఇసుక రీచ్ లపై పడింది. తాను చెప్పే వరకూ ఇసుక రీచ్ లకు అనుమతులు ఇవ్వద్దంటూ జిల్లా కలెక్టర్ పై మంత్రి ఒత్తిడి పెంచినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. లోక్ సభ ఎన్నికలు కూడా సమీపిస్తుండంతో ఏజెన్సీ ఇసుక రీచ్ లకు వెంటనే అనుమతులను ఇవ్వాలని ఆదివాసీ ఇసుక సంఘాలు కలెక్టర్ పై ఒత్తిడి తెచ్చాయి. సంఘాలు ఆందోళనకు సమాయత్తం అవుతున్నారని తెలిసిన కలెక్టర్ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తేదీకి మూడు రోజుల ముందు ఇసుక రీచ్ ల ఫైల్ పై సంతకం పెట్టారు.

కలెక్టర్ అనుమతులను ఇచ్చిన తర్వాత కూడా రీచ్ లు నడపకుండా అడ్డుకోవాలని మంత్రి అనుచరులు ప్రయత్నాలు చేశారు. కలెక్టర్ అనుమతులు పొందిన ఆదివాసీ సంఘాలతో ఎటువంటి అగ్రిమెంట్లు చేయవద్దని తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులను మంత్రి ఆదేశించారని అధికారులు అంటున్నారు. ఆదివాసీ ఇసుక సంఘాలకు అనుమతుల విషయంలో చొరవ చూపించిన గనుల శాఖ ముఖ్య కార్యదర్శి బీఎమ్ ఎక్కాను ప్రభుత్వం అకారణంగా బదిలీ చేయడంతో కింది స్థాయి అధికారులు కూడా ఖంగు తిన్నారు. ఆ శాఖ కార్యదర్శితో పాటూ టీఎస్ఎండీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా మరో ఐఏఎస్ అధికారి సురేంద్ర మోహన్ ను ప్రభుత్వం నియమించింది.
తనకు మైనింగ్ శాఖతో సంబంధం లేకున్నా అన్నీ తానే నన్నట్టు వ్యవహరిస్తున్న మంత్రి జోక్యంతో అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు. ఇసుక ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచాలంటూ చెప్తున్న ముఖ్యమంత్రి మంజూరైన ఇసుక రీచ్ లను ఆపుతున్న మంత్రి వ్యవహారంపై స్పందించక పోవడం పట్ల అధికారులు అయోమయానికి గురవుతున్నారు. వచ్చే వానాకాలానికి సరిపడ ఇసుక నిల్వలు లేక పోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. గనుల శాఖను స్వయంగా ముఖ్యమంత్రి చూస్తున్నారు. కానీ సమస్యల గురించి సీఎం పట్టించుకోవడం లేదని అధికారులే అంటున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక రీచ్ లకు అనుమతులు ఇవ్వకుండా నిలిపివేయడంతో ఆదివాసీలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి ఆదివాసీ సహకార సంఘాలు సమాయత్తమవుతున్నాయి. ఆదివాసీ సహకార సంఘాలకు ఇసుక కేటాయింపుల విషయంలో ఒక మంత్రి జోక్యం చేసుకోవడం పట్ల మరొక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. మంత్రి నిర్వాకంతో తాము నియోజక వర్గాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని తమ అనుయాయుల వద్ద చెప్పుకుని వారు బాధ పడుతున్నారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇసుక అనుమతులకు బ్రేక్ వేస్తున్న మంత్రి అనుచరులు కావడం విశేషం.