చంద్రయాన్ 3 తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం గగన్ యాన్.. ఇస్రో చేపట్టనున్న తొలి మానవ సహిత ప్రయోగం కూడా ఇది.. ఇస్రో ముందుగా తలపెట్టినట్టుగా జరిగి ఉంటే 2022 లోనే గగన్ యాన్ ప్రయోగం పూర్తి కావాల్సి ఉంది.. కానీ కరోనా కారణంగా ఇస్రో క్యాలెండర్ పూర్తిగా అస్తవ్యస్తం అయింది.. ఈ క్రమంలో రెండేళ్ల ఆలస్యంగా 2024 లో ప్రయోగం జరగనుంది.. ఇందు కోసం ఇస్రో ముందస్తు ప్రక్రియను వేగవంతం చేసింది.. ఈ ప్రయోగం కోసం ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళతారు.. నిర్దేశిత కక్ష్యలో మూడు రోజుల పాటు ప్రయోగం అనంతరం తిరిగి భూమి మీదకు వస్తారు.. అంతరిక్షంలోకి వెళ్లనున్న ఆ ముగ్గురు వ్యోమగాములకు ప్రస్తుతం శిక్షణ కూడా పూర్తి కావొచ్చింది..
సాధారణంగా ఉపగ్రహాలను నింగిలోకి పంపే ప్రక్రియతో పోల్చితే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ అత్యంత క్లిష్టమైనది. వ్యోమనౌకను భూమిపై నుంచి కక్ష్యలోకి పంపడం కోసం భారీ బరువును మోసుకెళ్లే సామర్ధ్యం కలిగి ఇస్రోకి నమ్మకమైన LVM-3 వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది..అయితే నిర్దేశిత సమయం.. అంటే మూడు రోజుల ప్రయోగం తర్వాత తిరిగి వ్యోమగాములు భూమికి తిరిగి తీసుకు రావడం అసలైన సవాల్.. ఇందుకోసం వాడే టెక్నాలజీ ఇస్రో సొంతంగా రూపొందిస్తోంది.. తిరిగి వచ్చే సమయంలో క్యాప్సూల్ మాడ్యూల్ ద్వారా భూమికి తిరిగి వస్తారు.. అంతరిక్షం నుంచి భూకక్ష్యలోకి వచ్చేప్పుడు దాని వేగం చాలా ఎక్కువగా ఉంటుంది..
అందుకే ఆ మాడ్యూల్ సముద్రంలో పడేలా చూస్తారు. అలా పడ్డాక దాన్ని రికవరీ చేసేందుకు ముందుగానే నావి, ఆర్మీ, ఇస్రో అధికారులు సిద్ధంగా ఉంటారు.. ఈ ప్రక్రియను గత నెలలోనే ముగించిన ఇస్రో తాజాగా మరో పరీక్షను కూడా చేపట్టింది.వ్యోమగాముల తిరుగు ప్రయాణంలో ప్యారచూట్ పరీక్షలను చేపట్టింది. ఇస్రో, DRDA సహకారంతో చండిఘర్ నందు ప్యారా చూట్ టెస్ట్‌లను విజయవంతంగా చేపట్టింది. నింగి నుంచి కిందకు దిగే సమయంలో ప్యారా చూట్ సామర్థ్యం ఏ మేరకు తట్టుకోగలదు అనే అంశంపై శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు పరీక్షలు నిర్వహించారు. ట్రైన్ ట్రాక్ తరహాలో గంటకు 200 నుంచి 400 కి.మీ వేగంతో వెళ్లే ప్రక్రియను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది.. 2024 ఫిబ్రవరి నెలలో జరగనుంది.. ఇప్పటిదాకా ఉపగ్రహాలను అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి పంపుతూ ఇతర దేశాలకు సైతం సేవలను అందిస్తోన్న ఇస్రో ఇప్పుడు మానవ సహిత ప్రయోగాలను సైతం సక్సెస్ చేసి సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది..