తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనకు ముహుర్తం ఖరారైంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు సీఎం కేసీఆర్. ఆగస్టు చివరివారం నుంచి రెండు జిల్లాల్లో పర్యటనలు చేస్తూ.. బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఈ సభల ద్వారా ఎన్నికల వాతావరణం సృష్టించేలా గులాబీ బాస్ ప్రణాళికగా తెలుస్తోంది.అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆగస్టులోని ఈ వారం చివరలో మెదక్ జిల్లా, సూర్యాపేట జిల్లాలలో ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు, పలు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ మ్యాప్ సిద్దమయింది. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీస్కెళ్లడంతో పాటు.. తన బహిరంగ సభల ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలని ఎండగట్టడమే సీఎం కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది.
ఆగస్టు 19న మెదక్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయాన్ని, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని ప్రారంభించి.. బహిరంగ సభలో పాల్గొంటారు కేసీఆర్. సభ కంటే ముందు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే మెదక్ జిల్లా నాయకులు.. గులాబీ అధినేత పాల్గొనే సభా నిర్వహణా పనుల్లో తలమునకలై ఉన్నారు.ఇక ఆగస్టు 20న సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి.. అనంతరం కొత్తగా నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అదే సందర్భంలో..సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీ ప్రారంభించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల తర్వాత సూర్యాపేటలో నూతనంగా నిర్మించిన బిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సభలో ప్రసంగిస్తారు సీఎం కేసీఆర్.
ఇదిలావుంటే తొలి జాబితాను బీఆర్ఎస్ పార్టీ రెడీ చేసినట్లుగా సమాచం. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లుగా తెలుస్తోంది. దుబ్బాక, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఎవరిని పోటీకి దింపాలనేది తొలి జాబితాలోనే ఫిక్స్ చేస్తారని ప్రచారంలో ఉంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా రెండో లిస్టును ప్రకటించనున్నారు. అదే సమయంలో లెప్ట్ ఫార్టీలతో పొత్తు ఉంటుందా.. లేదా అనే విషయాన్ని తేల్చనున్నారు ముఖ్యమంత్రి.. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ పార్టీలోకి ఆగస్టు 17న లేదా 18న బీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైనట్లుగా సమాచారం.. మొదటి జాబితాలో ఆ ఎమ్మెల్యే పేరు కూడా ఉండొచ్చని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. సీఎం కేసీఆర్ మరోమారు గజ్వేల్ నుంచే పోటీ చేయడం పక్క అని సమాచారం.