తెలంగాణ కాంగ్రెస్‌లో జిల్లా అధ్యక్షులుగా ఓసీలే ఎక్కువ మంది ఉన్నారని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సరైన ప్రాధాన్యత లభించడంలేదంటూ కొందరు బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. పార్టీలోనే ఉన్న సినీయర్ బీసీ నేతలను కాదని, కొత్తగా వచ్చినవారికి పదవులు లభిస్తున్నాయని ఆసమ్మతి తెలిజేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుల జాబితాను ఓ సారి పరిశీలిస్తే.. ఓసీలు 22, బీసీలు 6, ఎస్సీలు 3, ఎస్టీలు 2, మైనార్టీల తరఫున ఇద్దరు ఉన్నారు. బీసీ నాయకులకు 6 జిల్లాలను మాత్రమే ఇచ్చిన కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని ఎలా చేస్తుందనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అటు 22 మంది ఓసీ నాయకుల్లో కూడా 15 జిల్లాల అధ్యక్షులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కాగా.. వెలమ 4, వైశ్య, ఠాకూర్, కమ్మ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరే ఉన్నారు. జిల్లా అధ్యక్షుల లెక్కలు ఇలా ఉన్న నేపథ్యంలో.. అందరిని కలుపుకొని పోవాలని చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం మాటలను రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదా? లేదా అధిస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? అనే అనుమానాన్ని కొందరు బీసీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా రాష్ట్రంలోని మూడు జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగిన విషయం తెలిసిందే. వీరిలో నిర్మల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన శ్రీహరి రావు.. మహేశ్వర్ రెడ్డి హస్తం పార్టీ నుండి వెళ్లిపోయాకా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ పీసీసీ చీఫ్ రేవంత్ మాత్రం కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు వీళ్ళు అంటూ రికమండేషన్ చేయడంపై కూడా సీనియర్ బీసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనగామ డీసీసీ విషయంలో.. పొన్నాల లక్ష్మయ్య కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని వ్యతిరేకించే పొన్నాల.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రతాప్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫార్స్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఢిల్లీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేశారు పొన్నాల. బీసీ నేత పొన్నాలకి చెక్ పెట్టడానికే.. కొమ్మూరిని తెచ్చి పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పీసీసీ చీఫ్‌గా పని చేసిన పొన్నాల విషయంలోనే ఇలా ఉంటే.. మిగిలిన చోట పరిస్థితి ఏంటన్న వాదన లేకపోలేదు.
ఇక ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీకి.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కో చైర్మన్‌ని చేసి ఆయన్ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉద్యమ కారుడు పొన్నం ప్రభాకర్‌కి ఇప్పటి వరకు పదవి లేదని, ఆయన తర్వాత పార్టీలోకి వచ్చిన ఓసీ నేతలకు మాత్రం పదవులు ఇస్తున్నారని కొందరు బీసీ నేతలు వాపోతున్నారు. పార్టీ పదవుల్లోనే సామాజిక న్యాయం లేదు, సీనియర్ నేతలకే చెక్ పెట్టె పనిలో ఉన్నారనే ఫిలింగ్ కొందరు బీసీ నేతల్లో ఉంది. భువనగిరి కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి పార్టీలో సీనియర్ లీడర్ కావడంతో ఆయన విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ.. మిగిలిన ఇద్దరూ పార్టీలో జూనియర్స్ అని, వారి కంటే సినీయర్ బీసీ నేతలు ఉన్నారని కొందరి వాదన. ఇలా తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ నాయకుల సంతృప్తి, కొత్తవారికే ప్రాధాన్యతనిస్తున్నారని అసమ్మతి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ పార్టీ నాయకత్వం వెంటనే ఈ సమస్యలపై దృష్టి సారించాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.