ముగ్గురు మహిళల శవాలు వెలికితీత, బాలుడు శవం కోసం గాలింపు
బంధువుల ఇంటికి బోనాల పండగకి వచ్చి చెరువులో బట్టలు ఉతుక్కోవడానికి వెళ్లి చెరువులో మునిగి నలుగురు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఆదివారం రంగాయిపల్లి గ్రామంలో బోనాల పండుగ కి అంబర్ పేట గ్రామానికి చెందిన లక్ష్మి,బాలమణి ఆమె కుమారుడు చరణ్ లు తమ బంధువులు పిరంగి చంద్రయ్య ఇంటికి వచ్చారు.
ఇద్దరు మహిళలు, బాబు, రంగాయిపల్లికి చెందిన చంద్రయ్య కుమార్తె లావణ్యతో కలిసి ఉదయం స్థానిక చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఆ సమయంలో బాలమణి కుమారుడు చెరువులో ఆడుతూ నీట మునగగా బాలుడిని కాపాడబోయి బాలమణి, లక్ష్మి,లావణ్యలు ఒకరి తర్వాత ఒకరు నీటమునగడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా ముగ్గురు మహిళల మృతదేహాలు చెరువు నుండి బయటకు తీయగా, బాలుడు చరణ్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. పండుగ కోసం వస్తే పైలోకానికి వెళ్లారా అంటూ బంధువులు రోదన మిన్నంటాయి. గ్రామంలో విషాదం అలుముకుంది.