60 ఏళ్ల వయసున్న తన తండ్రి మరో మహిళతో సహజీవనం చేస్తుండడం చూసి తట్టుకోలేకపోయిన కుమారులు చేసిన దాడిలో వారి తాత, సహజీవనం చేస్తున్న మహిళ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాలతో తండ్రి ఆసుపత్రిలో చేరాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరు జిల్లాలో జరిగిందీ ఘటన. రాంప్రకాశ్ ద్వివేదీ (83), ఆయన కుమారుడు విమల్ (63) కలిసి ఉంటున్నారు. వారి ఇద్దరు కుమారులు లలిత్, అక్షిత్ వేరుగా ఉంటున్నారు.
30 ఏళ్ల ఖుష్బూతో విమల్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిన కుమారులు ఆగ్రహంతో ఊగిపోతూ తండ్రి ఇంటికి చేరుకుని వాగ్వివాదానికి దిగారు. అది గొడవకు దారితీయడంతో తాత రాంప్రకాశ్, తండ్రి విమల్, ఖుష్బూలపై వారు కత్తితో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన రాంప్రకాశ్, ఖుష్బూ ప్రాణాలు కోల్పోగా, విమల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.