- పది నెలల్లో ఐదుగురు ఎండీలు
- నేతకు నచ్చక పోతే అంతే సంగతులు
- ఐఏఎస్ లూ జీ హుజూర్ అనాల్సిందే
- వివాదాలకు కేంద్రంగా టీజీఎండీసీ
ప్రభుత్వ విధానం మేరకు ఖనిజాలను వెలికితీసి ఖజానాకు ఆదాయం పెంచాల్సిన తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో ఐదుగురు ఎండీలను నియమించడం ద్వారా రాష్ట్ర చరిత్రలోనే కొత్త అధ్యాయానికి తెర లేపింది. టీజీఎండీసీ కార్యాలయం కేవలం ఇసుక కార్యాలయంగా మారిపోయింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఇసుక ద్వారానే సంత్సరాదాయం రూ. 1200 కోట్లకు పెరిగింది. కొత్త ఇసుక విధానం తీసుకురావడంతో పాటు పారదర్శక నిర్ణయాలతో సంస్థకు మంచి పేరు వచ్చింది. కానీ గత పది నెలల కాలంలో దీని ప్రతిష్ఠ మసకబారి పోయింది. నామినేటెడ్ నేత మితిమీరిన జోక్యంతో సంస్థ వివాదాల పాలయిందని సంస్థ అధికారులే అంటున్నారు. ప్రభుత్వంతో పాటు తనకు వ్యక్తిగత ఆదాయం తెచ్చిపెట్టే ఎండీ కావాలనే కోరికతో ఐఏఎస్ అధికారిని కూడా సదరు నేత మార్పించారనే ఆరోపణలు వచ్చాయి.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐఏఎస్ అధికారులెవరూ టీజీఎండీసీ ఎండీ పోస్టుపై ఆసక్తి చూపలేదు. ఈ దశలో సహకార శాఖ అదనపు డైరెక్టర్ హోదా కలిగిన గ్రూప్ వన్ అధికారి డాక్టర్ జి మల్సూరు ను ఎండీగా అప్పటి ప్రభుత్వం నియమించింది. డైనమిక్ అధికారిగా పేరు తెచ్చుకున్న మల్సూరు ప్రభుత్వ ఆదాయం పెంచడంతో పాటూ అవినీతి రహిత పారదర్శక విధానాలతో పనిచేశారు. పలు సందర్భాల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు పొందారు. అందుకే ఆ పోస్టులో ఆయన ఎనిమిదిన్నరేండ్ల కాలం పనిచేశారు. బీఆర్ఎస్ హయాంలో మల్సూరును టీజీఎండీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించడంలో అప్పటి బీఆర్ఎస్ నేత, ప్రస్తుత రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్ర కీలకమైంది. పొంగులేటి ఆశిస్సులతో ప్రస్తుత ప్రభుత్వంలో కూడా మల్సూరు కొనసాగుతారని అందరూ ఆశించినప్పటికీ అది జరగలేదు. సీఎంకి ఆయన కొనసాగింపు ఇష్టం లేక పోవడంతో పాటు మల్సూరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకోవడంతోస్థాన చలనం కలిగింది. టీజీఎండీసీలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా మల్సూరు నియమితులయ్యారు. మల్సూరును బదిలీ చేసిన తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గనుల శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కూడా ఈ మేరకు కొంత కసరత్తు చేశారు.
‘ఎక్కా’ కు అవినీతి మరక..
సీనియర్ ఐఏఎస్ అధికారి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కాను ఖనిజాల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించి టీజీఎండీసీ ఎండీగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఇసుక రీచ్ ల కేటాయింపు, బిల్లుల చెల్లింపుల కోసం బహిరంగంగా లంచాలు మింగారనే అభియోగంతో మూడు నెలలు నిండకముందే ఆయన్ని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన పనితీరుపై సీఎం కి రహస్య నివేదిక అందింది. మంత్రి పొంగులేటి కూడా ఎక్కాను బదిలీ చేయాలని సీఎం ను కోరినట్లు తెలిసింది. ఆయన స్థానంలో మైనింగ్ కార్యదర్శిగానూ టీజీఎండీసీ ఎండీగానూ మరో ఐఏఎస్ అధికారి సురేంద్ర మోహన్ ను ప్రభుత్వం నియమించింది.
ఆరు నెలలకే సురేంద్ర మోహన్ బ(ది)లి..
ముక్కుసూటి అధికారిగా పేరు తెచ్చుకున్న సురేంద్రమోహన్ ఇసుక కాంట్రాక్టర్లను దగ్గరికి రానీయలేదు. అవినీతికి అవకాశం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారనే పేరుంది. ఇది కొందరికి నచ్చలేదు. నాలుగు ఇసుక రేణువులు వెనకేసుకుందామని నామినేటెడ్ పోస్టు సంపాదిస్తే సురేంద్రమోహన్ సైంధవుడిలా అడ్డుపడుతున్నాడని అధికార పార్టీకి చెందిన ఒక నేత ఆయన్ని బదిలీ చేయించడం రాష్ట్ర అధికార వర్గాల్లో సంచలనం కలిగించింది. ఇసుక మాఫియాతో అంటకాగుతున్న ఆ నేత ముఖ్యమంత్రికి సన్నిహితుడనని చెప్పుకుంటూ పనులు చక్కబెడుతున్నాడు.
ఏక్ హప్తే కా సుల్తాన్..
సురేంద్ర మోహన్ ను ఎండీ స్థానం నుంచి తొలగించిన తర్వాత ఆ పోస్టులో ఎవరిని నియమించాలో తెలియక ప్రభుత్వం సందిగ్థంలో పడింది. పొంగులేటి సూచన మేరకు పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ జి. మల్సూరుకే అదనపు బాధ్యతలను ఇచ్చి టీజీఎండీసీ ఎండీగా ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకంతో స్వార్థ పరుల గొంతులో వెలక్కాయ పడినంత పనైంది. ఆఘమేఘాల మీద నామినేటెడ్ నేత చక్రం తిప్పడంతో మల్సూరును మళ్ళీ తీసివేసి ఆయన ఒరిజినల్ పోస్టుకు పంపించారు. తనకు తెలియకుండా మల్సూరును తొలగించడం పట్ల మంత్రి పొంగులేటి సీఎం వద్ద అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఐదవ కృష్ణుడిగా విశ్రాంత అధికారి..
పది నెలల కాలంలో టీజీఎండీసీకి ఐదవ ఎండీగా విశ్రాంత అధికారి సుశీల్ కుమార్ నియమితులయ్యారు. గనుల శాఖ డైరెక్టర్ గా గత సంవత్సరం ఆయన ఉద్యోగ విరమణ చేశారు. విశ్రాంత అధికారి అయితే తమ చెప్పుచేతల్లో ఉంటారని భావించిన నేతలు ఆయన నియామకానికి మొగ్గు చూపినట్లు తెలిసింది. ఇసుక, తదితర ఖనిజాల తవ్వకాల విషయంలో చట్టబద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయం పెంచాల్సిన దశలో ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోకుండా చదరంగంలో పావులను కదిపినట్లు అధికారులను కదపడంతో టీజీఎండీసీ లో అసలు ఏమి జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. తరచూ ఎండీలను మార్చడంతో కింది స్థాయి అధికారులు, సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. కొండ నాలుక్కి మందేస్తే అసలు నాలుక పోయిన చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి. టీజీఎండీసీ వ్యవహారం అటు సీఎం కు వ్యక్తిగతంగానూ, ఇటు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోంది.