- ములుగు జిల్లాలో ఇసుక సిండికేట్..
- 30 రీచ్ లు ‘హస్త’గతం
- అనుమతుల కోసం చక్రం తిప్పిన నేతలు
- అక్రమాలకు తెరలేపిన మాఫియా
- ముడుపుల మత్తులో నలుగురు అధికారులు
- అన్నీ తానై నడిపిస్తున్న టీజీఎండీసీ డాన్
- సర్వే స్థాయిలోనే భారీగా అక్రమాలు
- కలెక్టర్ కు ఫిర్యాదుల వెల్లువ
రాష్ట్రంలో ఇప్పటి వరకూ మద్యం సిండికేట్, రియల్ ఎస్టేట్ మాఫియా ఉన్నాయని అందిరికీ తెలుసు. తాజాగా ఇసుక సిండికేట్ ఏర్పడటం సంచలనం కలిగిస్తున్నది. ములుగు జిల్లా కేంద్రంగా ఏర్పడిన ఈ సిండికేట్ కొత్త ఇసుక రీచ్ ల మంజూరీ కోసం కొందరు అధికారులకు భారీగా ముడుపులు చెల్లించి 30 ఇసుక రీచ్ లను గుప్పెట్లో పెట్టుకున్నది. అధికార పార్టీ నేతలతో పాటు బీజీపీకి చెందిన ఒక నాయకుడు కూడా సిండికేట్ లో కీలక పాత్ర నిర్వహించడం విశేషం. ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక రీచ్ లను పీసా చట్టం ప్రకారం గిరిజన సహకార సంఘాలకు కేటాయిస్తున్నప్పటికీ గత పదేండ్లుగా బినామీ కాంట్రాక్టర్లే వీటిని నిర్వహిస్తున్నారు. నిబంధలకు విరుద్ధంగా యంత్రాలను వినియోగించడం, ఓవర్ లోడింగ్, అక్రమ రవాణా, నకిలీ వేబిల్లుల వంటి దందాలతో కాంట్రాక్టర్లు కోట్లకు పడగలెత్తారు. ఇసుక రుచి మరిగిన నేతలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి అక్రమాలకు పాల్పడుతున్నా అధికార యంత్రాంగం వారికి సహకరించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ నేతలు గోదావరి తీరంలో ఇసుకపై కన్నేసి ఆదివాసీలకు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారు.
ములుగు జిల్లాలో ఇటీవల టీజీఎండీసీకి కేటాయించిన 30 ఇసుక రీచ్ ల వ్యవహారంలో మంత్రి సీతక్కకు అనుచరుడని చెప్పుకుంటున్న ఒక నేతతో పాటు, వరంగల్ ప్రాంతానికి చెందిన మరో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో వెంకటాపురం మండలంలో ఒక ఇసుక రీచ్ నిర్వహించిన కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో ఇసుక సిండికేట్ కి రూపకల్పన జరిగింది. ఈ కాంట్రాక్టర్ బీజేపీ నాయకుడని, ఈటల రాజేందర్ అనుచరుడని పేరుంది. అతని కుమారుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రెండు పార్టీల అక్రమ సంబంధంతో సిండికేట్ ఏర్పడగా వీరందరికీ గాడ్ ఫాదర్ గా హైదరాబాద్ లోని ఒక కార్పొరేషన్ చైర్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాను సీఎంకి సన్నిహితుడనని, అన్నీ తాను చూసుకుంటానని చెప్పి గుడ్ విల్ పార్టనర్ గా సిండికేట్ లో ఆ నాయకుడు చేరినట్టు సిండికేట్ సభ్యులే ప్రచారం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మాజీ వీఆర్వో,చర్ల ప్రాంతానికి చెందిన మరొక మాఫియా డాన్, రామచంద్రాపురం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్, మంగపేట మండలంలో రీచ్ లు నిర్వహిస్తున్న పొంగులేటి అనుచరుడు సిండికేట్ లో సభ్యులుగా ఉన్నారు. చిన్న కాంట్రాక్టర్లు దరి చేరకుండా 30 రీచ్ లను సిండికేట్ సర్వే చేయించింది. వెంకటాపురం మండలంలో 23 ఇసుక రీచ్ లు, మంగపేట మండలంలో 7 ఇసుక రీచ్ లు సిండికేట్ గుప్పెట్లోకి వెళ్ళి పోయాయి.
అడుగడుగునా అక్రమాలు..
ఇసుక రీచ్ ల కోసం దరఖాస్తు పెట్టించడం నుంచి అనుమతుల వరకూ అన్నీ తామై చూసుకుంటున్న ఇసుక సిండికేట్ కు అధికారుల అండదండలు లభించడం వెనుక కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు తెలిసింది. నిబంధలను గాలికి వదిలి సిండికేట్ కోరిన ప్రదేశాల్లో ఇసుక రీచ్ లను సర్వే చేయడం ద్వారా అధికారుల బొక్కసాలు నిండాయి. ప్రతి సంవత్సరం గోదావరి వరదలు తగ్గిన తగ్గిన తర్వాత ఇసుక రీచ్ లను సర్వే చేయాలనే నిబంధనను గాలికి వదలి వేశారు. 2022, 2023, 2024 సంవత్సరాల్లో సర్వే చేసిన ఇసుక రీచ్ లకు కలెక్టర్ అనుమతులను తీసుకున్నారు. గోదావరి నది వెడల్పులో ఐదవ వంతు వదలి వేసి ఇసుక రీచ్ లను సర్వే చేయాలనే నిబంధనతో పాటు రెండు ఇసుక రీచ్ ల మధ్య కనీసం 500 మీటర్ల దూరం ఉండాలనే నిబంధన కూడా బే ఖాతర్ చేస్తూ పక్క పక్కనే రీచ్ ల కోసం సర్వే చేశారు.నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నీరు ఉండే ప్రదేశాల్లో కూడా ఇసుక రీచ్ లను సిఫారసు చేశారు.
అక్రమ సర్వేకు సూత్రధారిగా భూగర్భ జల శాఖకు చెందిన అధికారి వ్యవహరించగా మైనింగ్, ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు పాత్రధారులుగా మారారు. ఒక్కొక్క రీచ్ కి మూడు నుంచి ఐదు లక్షల వరకూ వివిధ శాఖల అధికారులకు ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. కొందరు అధికారులు సర్వేలో పాల్గొన కుండానే కార్యాలయంలో కూర్చుని సంతకాలు పెట్టినట్లు తెలిసింది. అధికారులకు ముడుపులు ఇప్పించి అక్రమాలకు డాన్ గా నిలిచిన అధికారికి ఇటీవల టీజీఎండీసీ బాధ్యతలు కూడా అప్పగించడం సంచలనం కలిగించింది. సర్వే సమయంలో భారీ ముడుపులు ముట్టిన సదరు అధికారి అగ్రిమెంట్ల సమయంలో రెండవసారి ముడుపులు తీసుకోవడం చర్చనీయాంశమైంది. అవినీతి డాన్ పై ఎన్ని ఆరోపణలు వచ్చినా అతనిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు భయపడుతున్నారు. పదేండ్ల కాలం నుంచీ ములుగు జిల్లాలో తిష్ఠ వేసిన ఈ అధికారి ఆగడాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెరిగిపోయాయి. రాష్ట్ర స్థాయి చైర్మన్ అతని బంధువు కావడంతో ఖనిజాల సంస్థ అధికారిగా అతనికి పోస్టింగ్ ఇచ్చినట్లు మాతృశాఖ అధికారులు అంటున్నారు.
కలెక్టర్ ను పక్కదారి పట్టిస్తున్న మాఫియా..
జిల్లా ఇసుక కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ ను కూడా ఇసుక మాఫియాతో పాటు కింది స్థాయి అధికారులు పక్కదారి పట్టిస్తున్నారు. కొత్త ఇసుక రీచ్ లు, పట్టాభూములకు సంబంధించి 50 కి పైగా ఫైళ్ళు పెండింగ్ లో ఉండగా మాఫియా సర్వే చేయించిన 30 రీచ్ లకు మాత్రమే మొదటి లిస్ట్ లో అనుమతులు రావడం సంచలనం కలిగించింది.హై కోర్టు ఉత్తర్వులు ఉన్న పట్టా భూముల ఫైళ్లను కూడా పెండింగ్ లో పెట్టారు. గతంలో జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కృష్ణ ఆదిత్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇసుక రీచ్ లను పరిశీలించేవారు. సర్వే లో అక్రమాలు జరిగాయని భావిస్తే వాటిని నిలిపివేసే వారు. కానీ ప్రస్తుత మైనింగ్ ఏడీ పాత్ర ప్రశ్నార్థకంగా మారింది. ఏ ఫైల్ ఎప్పడు సర్వే చేశారో కూడా చెప్పకపోవడం, సర్వేకి సంబంధించిన ఫోటోలను కూడా కలెక్టర్ కి పెట్టక పోవడంతో కలెక్టర్ కూడా సమాచార లోపంతో నిర్ణయాలు తీసుకొంటున్నారని తెలుస్తోంది. బినామీ కాంట్రాక్టర్లను నిరోధించడంలో అధికార యంత్రాంగం విఫలం కావడంతోటే ఇటువంటి పరిస్థితి ఎదురవుతోంది.
గోదావరి తీరంలో పర్యావరణ విపత్తు..
ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం, ఏటూరునాగారం, వాజేడు మండలాలు పూర్తిగానూ, మంగపేట, వెంకటాపురం మండలాలు పాక్షికంగానూ ఏటూరునాగారం ఎకో సెన్సిటివ్ జోన్ పరిథిలో ఉన్నాయి. ఈ పరిథిలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉండడంతో వెంకటాపురం మండలంలోని ఐదారు పంచాయితీలు, మంగపేట మండలంలోని మూడు పంచాయితీ పరిథిలోనే ఇసుక రీచ్ లను మంజూరు చేసే అవకాశం ఉన్నది. కేవలం వెంకటాపురం మండలంలోనే 23 ఇసుక రీచ్ లకు మంజూరు చేయగా పట్టాభూములతో కలిపి మరో 15 ఫైళ్ళు పెండింగ్ లో ఉన్నాయి. వీటి గురించి కలెక్టర్ పట్టించుకోవడం లేదు. మంగపేట మండలంలో 7 ఇసుక రీచ్ లను సిఫారసు చేశారు. ములుగు జిల్లా పరిథిలో గోదావరిపై విచక్షణా రహితంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలతో తీవ్ర పర్యావరణ ముప్పు ఏర్పడుతున్నది.గోదావరి ఒడ్డులోని వ్యవసాయభూములు కోతకు గురై గోదావరిలో కలిసిపోవడం, ఫలితంగా కొద్దిపాటి వరదలకు కూడా తీర ప్రాంత వాసులు తట్టుకోలేక పోతున్నారు.
ఒకే ప్రాంతంలో లెక్కకు మించి రీచ్ లు మంజూరు చేయడంతో ఆ ప్రాంతవాసులు కాలుష్యం పాలవుతున్నారు. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. వెంకటాపురం మండల కేంద్రం నుంచి, వివిధ గిరిజన గ్రామాల నుంచి వందల కొలది ఇసుక లారీలు వెళ్ళడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. 23 రీచ్ లు ఒకే సారి మంజూరు చేస్తే రోజుకు రెండు మూడు వేల లారీలు ఈ ప్రాంతం నుంచి వెళ్తాయి.దుమ్ము, ధూళితో పాటు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతాయి. చేలల్లో దుమ్ము పడితే పంటలు పండవు. ఈ ప్రాంతంలో ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వెంకటాపురం మండల కేంద్రానికి బైపాస్ రోడ్ కావాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా మినరల్ ఫండ్ లో కోట్లాది రూపాయలున్నా ఈ ప్రాంత అభివృద్థికి ఖర్చుపెట్టడం లేదు.