- చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు
- రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన టీడీపీ లీగల్ సెల్
- సీఐడీ కస్టడీ, విచారణ గురించి చంద్రబాబుతో చర్చించిన న్యాయవాది లక్ష్మీనారాయణ
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో రేపు, ఎల్లుండి చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును విచారించనున్నట్టు కోర్టుకు సీఐడీ తెలిపింది. ఇద్దరు లాయర్ల సమక్షంలోనే చంద్రబాబును విచారించాలని సీఐడీకి కోర్టు కండిషన్ పెట్టింది.
చంద్రబాబును విచారించే అధికారుల వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే చంద్రబాబును విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, చంద్రబాబు రిమాండ్ లో ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ లీగల్ సెల్ వెళ్లింది. జైల్లో చంద్రబాబును న్యాయవాది లక్ష్మీనారాయణ కలిశారు. ములాఖత్ ద్వారా ఆయనతో భేటీ అయ్యారు. సీఐడీ కస్టడీ, విచారణ గురించి ఆయనతో చర్చించారు.