A place where you need to follow for what happening in world cup

కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య పై ముప్పేట దాడి

  • ఒకవైపు అసమ్మతి పోటు మరోవైపు వలస బాట పట్టిన నేతలు
  • అయోమయంలో ఎమ్మెల్యే మల్లయ్య అభిమానులు
  • త్వరలో పార్టీ వీడనున్న మరో ఎంపిపి , మండల పార్టీ అధ్యక్షుడు…?

కోదాడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రెండవ సారి టికెట్ దక్కించుకున్న ఆనందంకన్నా అసమ్మతి నేతలు ఒక వైపు , సొంత పార్టీని వీడుతున్న ముఖ్యనేతలు మరో వైపు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు . నిన్నటిదాక విడివిడిగా ఉన్న అసమ్మతి నేతలంతా ఆదివారం ఒకేతాటి పైకి వచ్చి తెలంగాణ ఉద్యమకారుడు శశిధర్ రెడ్డి కే బిఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని లేని పక్షంలో మల్లయ్య ను ఓడిస్తామని బహిరంగ ప్రకటన చెయ్యడం కలకలం రేపుతోంది . ఇది జరిగిన మరునాడే చిలుకూరు మండలానికి చెందిన మాజీ ఎంపిపి బజ్జురి. వెంకట రెడ్డి కారు దిగి ఉత్తమ్ తో చేతులు కలపటం కలకలం రేపింది .

ఇప్పటికే ఈ మండలంలో ప్రస్తుత ఎంపిపి , జెడ్పిటిసి అసమ్మతి శిభిరంలో ఉండగా ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా ఉన్న బజ్జురి . వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ మండలంలో బిఆర్ఎస్ కు కోలుకోని దెబ్బ తగిలినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నెల రోజుల క్రితం వరకు కోదాడ ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా ఉన్న కోదాడ మార్కెట్ కమిటీ తాజా మాజీ చైర్మన్ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చి సొంత కుంపటి పెట్టుకోగా , తాజాగా తాను చెప్పిన వారికి దళితబంధు ఇవ్వలేదని దీనితో మండలంలో తాన పరువు పోయిందని ఓ మండల పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా మరో ఎంపిపి అసమ్మతి శిభిరం లో చేరడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం .

అయోమయంలో ఎమ్మెల్యే మల్లయ్య అనుచరులు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీ దూకుడుగా ముందుకెళ్తుండగా నిన్న , మొన్నటి వరకు తమకు ఎదురే లేదని చెప్తున్న తమ నేతపై ముప్పేట దాడి మొదలవడంతో మల్లయ్య అభిమానులు అయోమయంలో పడ్డారు . మున్ముందు ఈ పరిణామాలు ఎటు వైపుకు దారితీస్తాయో అని ఆందోళన చెందుతున్నారు . ఇప్పటికే గుడిబండ గ్రామానికి మంజూరయిన దళితబందు పథకం తమ నేతకు గుదిబండ లా మారిందని , తాజాగా గ్రామాలలో దళితబందు , బీసీ బంధు , గృహలక్ష్మి లాంటి ప్రభుత్వ పథకాలు నాలుగైదు యూనిట్లు మంజూరు చేస్తుండటంతో మిగతా వారంతా పార్టీకి దూరమవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

ఆందోళన కలిగిస్తున్న అసమ్మతి నేతల మాటలు

రెండు రోజుల క్రితం బిఆర్ఎస్ మాజీ ఇంచార్జ్ శశిధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన అసమ్మతి నేతలుఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ముఖ్య నేతల మాటల తీవ్రత కారు పార్టీలో కలకలం రేపుతున్నది . ఇప్పటి వాటివరకు తేరా వెనుకే ఉన్న అసమ్మతి నేతలు బహిరంగంగా మాట్లాడటం కాకుండా ఎమ్మెల్యే మల్లయ్య ను మార్చకపోతే ఓడిస్తామని అధిష్టానానికి అల్టిమేటం జారీ చెయ్యడం గమనించదగ్గ విషయం . ఒక వేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే తానూ ఇండిపెండెంట్ గానైనా బరిలో దిగుతానని శశిధర్ రెడ్డి ఘాటుగా స్పందించగా మరి కొందరు పార్టీ అభ్యర్థిని మార్చకపోతే గెలిచే వారు ఎవరో వారికి పార్టీలతో సంబంధం లేకుండా మద్దతు ఇద్దామని చెప్పడంతో రాబోయే కాలంలో కారు పార్టీలో కల్లోలం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .

ఉద్యమ కారులు కూడా ఎదురుతిరుగుతున్నారా?

టిఆర్ఎస్ ఆవిర్భావం నుండి కోదాడలో తొలి , మలిదశ ఉద్యమకారులతో పాటు విద్యార్థి జెఎసి నాయకులు కూడా కోదాడ ఎమ్మెల్యే వైఖరికి వ్యతిరేకంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది . వారం రోజుల క్రితం కోదాడ పబ్లిక్ క్లబ్ లో సమావేశమైన 1969 ఉద్యమకారులు ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని ప్రభుత్వం పై విమర్శలకు దిగగా , కోదాడ కు చెందిన ఓయూ జెఎసి నాయకుడు కందుల. మధు ఆదివారం జరిగిన అసమ్మతి సమావేశానికి హాజరై ఉద్యమకారుడైన శశిధర్ రెడ్డి కి మద్దతుగా మాట్లాడటంతో పాటు , ఉద్యమకారులందరిని ఏకం చేసి అక్టోబర్ ఒకటి న కోదాడ లో భారీ స్థాయిలో గద్దరన్న యాదిలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు . ఉద్యమ కారుడైన శశిధర్ రెడ్డి కి మద్దతు కూడగట్టడమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న అసలు ఉద్దేశమని పలువురు అంటున్నారు .

Leave A Reply

Your email address will not be published.