న్యూఢిల్లీ ఆగష్టు 2: బాలీవుడ్ అగ్ర కళా దర్శకుడు నితిన్ దేశాయ్ తన సొంత ఎన్‌డీ స్టూడియోస్ లో బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకోవడం చిత్ర పరిశ్రమ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. తీవ్రమైన రుణాల ఊబిలో కూరుకుపోవడమే ఆయన ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఫ్యానుకు ఉరివేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్న స్థలంలో ఎలాంటి ‘సూసైట్ నోట్’ కనిపించనప్పటికీ, ఒక అడియా రికార్డింగ్ కనుగొన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ప్రస్తుతం దానిని విశ్లేషిస్తున్నారు. రూ.250 కోట్ల వరకూ ఆయన ఆర్థిక సంస్థలకు బకాయి పడ్డారని, గత వారంలోనే ఆయన వేసిన ఇన్‌సాల్వెన్సీ పిటిషన్‌ను దివాలా కేసుల కోర్టు విచారణకు స్వీకరించిందని తెలుస్తోంది.
అప్పుల ఊబిలో…
దేశాయ్‌కి చెందిన ఎన్‌డీ ఆర్ట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.180 కోట్లు సీఎఫ్ఎం ద్వారా రుణంగా తీసుకుంది. 2016-2018 మధ్య లోన్ అగ్రిమెంట్‌పై సంతకాలు జరిగాయి. 2020 జనవరి నుంచి బకాయిల చెల్లింపు విషయంలో సమస్యలు మొదలయ్యాయి. ఇందుకోసం, దేశాయ్ 42 ఎకరాల భూమిని కుదవ పెట్టారు. అనంతరం సీఎఫ్ఎం తమ లోన్ అకౌంట్లను ఎడెల్విస్ అసెంట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించింది. అప్పటికీ రుణం రికవరీ కాలేదు. దాంతో ఎస్ఏఆర్ఎఫ్ఏఈఎస్ఐ చట్టం కింద కుదవ పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాలని ఎడెల్విస్ కంపెనీ అనుమతి కోరింది. గత ఏడాది సెప్టెంబర్‌లో చేసిన ఈ ప్రతిపాదన ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. దీంతో దేశాయ్ ఆర్థిక చిక్కుల్లో పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ఖలాపూర్ ఎమ్మెల్యే మహేష్ బల్దితో కొద్ది రోజుల క్రితం చర్చించారు