A place where you need to follow for what happening in world cup

ఇవాళ్టి నుంచి అసెంబ్లీ…. రంజుగా వరద రాజకీయం

హైదరాబాద్, ఆగస్టు 2:రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలతో ఉత్తర తెలంగాణ జిల్లాలు చిరుగుటాకులా వణికిపోయాయి. ప్రజల జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆదిలాబాద్‌ నుంచి భద్రాద్రి వరకు గోదావరి పరీవాహక ప్రాంతాలన్నీ అతలాకుతలమయ్యాయి. మోరంచపల్లి, కొండయి గ్రామాల దీనావస్థ తెలుగు రాష్ట్రాల ప్రజలను కదిలించిందనే చెప్పాలి. భద్రాద్రి చుట్టుపక్కల మండలాల వరదలు.. ఖమ్మం మున్నేరు మహోగ్రరూపం జనజీవనాన్ని స్తంభింపజేసింది. నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు దంచి కొట్టడంతో యావత్ తెలంగాణ వరద పోటును చవి చూసింది. హైదరాబాద్ మహానగరంతోపాటు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, అసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, కొత్తగూడెం, జనగామ జిల్లాల్లో విపరీతమైన వానలు కురిశాయి. ములుగు జిల్లా వెంకటాపూర్‌లో 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నిజామాబాద్ జిల్లా వేల్పూరులో 24 గంటల వ్యవధిలో 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా చెప్పుకుంటూ పోతే కుంభవృష్టి వర్షాలు తెలంగాణను కుదిపేశాయి. వర్షాలు తగ్గినా వరద మిగిల్చిన వ్యధలు మాత్రం ఇంకా కొనసాగుతూనే వున్నాయి. తెలంగాణలో గ్యాప్ ఇచ్చినట్టే ఇచ్చి వరుణుడు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం వరద తగ్గింది.. బురదే మిగిలింది.. కాని రాజకీయం రంజుగా మారింది. తెలంగాణలో భారీ వర్షాలతో ఓవైపు ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతుంటే.. ఈ బురదల్లోనూ పొలిటికల్‌ లీడర్స్ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ప్రభుత్వ అలసత్వం, అవినీతి వల్లే అపార నష్టం వాటిల్లిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తే.. కేంద్రం ఇచ్చిన డిజాస్టర్‌ ఫండ్స్‌ ఏం చేశారని బీజేపీ నిలదీస్తోంది. మరోవైపు మంత్రులంతా క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు అండగా నిలబడిందంటోంది అధికార బీఆర్ఎస్ పార్టీ. గ్రౌండ్ లెవెల్లో సాయానికి సంబంధించిన కార్యక్రమాలు ఎలా వున్నాయన్నది పక్కన పెడితే ఈ వరద బురద రాజకీయం మాత్రం జనాన్ని విసుగెత్తిస్తుందనే చెప్పాలి.అటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోనే ఇలాంటి పరిస్థితులే కనిపించాయి.

ఈ క్రమంలోనే అధికార, విపక్షాల మధ్య వరద రాజకీయం మొదలైంది. ప్రకృతి ప్రకోపం కొత్తేం కాదు.. కాని ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్‌ అయిందని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వరద సాయంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై కి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్‌ నేతలు. గోదావరి, మానేరు నదులపై శాస్త్రీయత లేకుండా కట్టిన ప్రాజెక్టుల కారణంగానే వరదలు వచ్చాయని వివరిచారు. సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం దారుణంగా విఫలం అయిందన్నారు. వెంటనే జోక్యం చేసుకుని బాధితులకు సాయం అందేలా చూడాలని వినతిపత్రి ఇచ్చారు కాంగ్రెస్‌ నేతలు. రాష్ట్రంలో వరదలపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క. వర్షాలపై ముందస్త సమాచారం ఉన్నా కూడా అధికారులతో సమీక్షలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఫలితంగానే భారీ నష్టం వచ్చిందన్నారు భట్టి. రాష్ట్ర వ్యాప్తంగా వరదల ధాటికి 40 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ముందస్తు వాతావరణ హెచ్చరికలున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమంటున్నారు నేతలు. వరద బాధితులకు సాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి. 900 కోట్ల రూపాయలు డిజాస్టర్‌ ఫండ్స్‌ ఉన్నా.. ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ నిధులను వాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరి ఆమోదం అక్కర్లేదని కిషన్ రెడ్డి చెబుతున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ నేతలు కూడా ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. ప్రకృతి వైపరీత్యాలతో తెలంగాణ ప్రజలు అల్లాడుతుంటే సాయం చేసేందుకు మాత్రం కేంద్రానికి చేతులు రావట్లేదంటూ తెలంగాణ సర్కారు ఆరోపిస్తోంది. 2016లో తెలంగాణలో వరదల కారణంగా రూ.5వేల కోట్ల ఆస్తి, పంటనష్టం వాటిల్లగా… ప్రధాని మోదీ మాత్రం పైసా ఇవ్వలేదని మండిపడింది. వరద బాధిత తెలంగాణకు కేంద్రం ఈ సారైనా నిధులిస్తుందా? లేక ఖాళీ చెయ్యే విదిలిస్తుందా? అని కేసీఆర్ సర్కారు ప్రశ్నిస్తోంది. ఇక వరదల వల్ల చనిపోయిన వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం 4 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది.

పంట నష్టంపై కూడా అధికారులు అంచనా వేసి నివేదిక సమర్పించిన అనంతరం పరిహారం విషయంపై క్లారిటీ ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.ఇదిలావుంటే భారీ వర్షాలు, వరదల నష్టంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానంలో డాక్టర్ చెరుకు సుధాకర్ పిటిషన్ దాఖలు చేశారు. వర్షాలకు 41 మంది మృతి, లక్షన్నరకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. పలు మరణాలను నివేదికలో ప్రస్తావించలేదని పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదించారు. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో విషజ్వరాల నియంత్రణ కోసం తగిన చర్యలు చేపట్టడం లేదన్నారు. దీనిపై విచారణ జరిపిన ధర్మసనం రాష్ట్రా ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వరద బాధితులకు మనోధైర్యం ఇచ్చేందుకు తీసుకున్న చర్యలు.. కడెం ప్రాజెక్టు పరిసర ప్రజల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. భారీ వర్షాలు, వరదల నష్టంపై విచారణను జూలై4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. ఓవైపు ప్రాణ నష్టంతో పాటు… ఎక్కువ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. చాలా గ్రామాలు ఇంకా తేరుకొని పరిస్థితి ఉంది. చాలాచోట్ల రోడ్లు తెగిపోయాయి.

ఇప్పటికే రాష్ట్రానికి చెందిన అధికారులు వరద నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు. ఇదిలావుంటే.. వరద నష్టాన్ని అంచనా వేయటానికి కేంద్ర బృందాలు కూడా తెలంగాణలో పర్యటిస్తోంది. ఈ మేరకు వివిధ మంత్రిత్వ శాఖల అధికారులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సలహాదారుడు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని కేంద్ర అధికారుల బృందంరాష్ట్రంలో పర్యటించింది. కేంద్ర బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా మోదీ ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగాల నివేదికల అధారంగా రాష్ట్ర రెవెన్యూ పునరావాస శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా కేసీఆర్ ప్రభుత్వం వరద సహాయ చర్యలను చేపట్టనున్నాయి. అయితే, ఈలోగానే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వస్తున్నాయి. ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సెషన్ ప్లాన్ చేసింది ప్రభుత్వం. ఈక్రమంలో చర్చకు ప్రభుత్వం సిద్ద పడినా, పడక పోయినా సభలో స్వల్ప సంఖ్యలో వున్న కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు వరద నష్టం, ప్రభుత్వ సాయం అంశాలపై రచ్చ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.