-
రాష్ట్రంలో 11 గంటలకు మించి రైతులకు కరెంట్ ఇవ్వడం లేదన్న వెంకట్‌రెడ్డి
-
ఇస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్
- విద్యుత్ రంగాన్ని సర్వ నాశనం చేశారని మండిపాటు
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓపెన్ చాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో 11 గంటలకు మించి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. 24 గంటల ఉచిత కరెంటు అనేది పచ్చి అబద్ధమని మండపిడ్డారు.
గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం బండ సోమారం గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను వెంకట్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బండ సోమవారం సబ్ స్టేషన్ బుక్ లో అన్ని వివరాలు ఉన్నాయని తెలిపారు.బీఆర్ఎస్ వాళ్లు పని లేక ధర్నాలు చేశారని మండిపడ్డారు.
‘‘పది లేదా పదకొండు గంటలకు మించి రైతులకు కరెంట్ ఇవ్వడం లేదు. మధ్యలో కూడా పవర్ కట్ అవుతోంది. 24 గంటలు కరెంట్ అంటున్న కేటీఆర్ ను బండసోమవారం సబ్ స్టేషన్ నుంచే ప్రశ్నిస్తున్నా” అని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సర్వ నాశనం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 11 గంటల కంటే ఎక్కువగా విద్యుత్ ఇస్తే రాజీనామాకు సిద్ధమని చెప్పారు.