A place where you need to follow for what happening in world cup

100 రోజుల ప్రణాళిక తయారు చేసి అమల్లోకి తీసుకువస్తాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నియమితుడైన టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇవాళ ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్ లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఈ బాధ్యత అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. కేంద్ర క్యాబినెట్ లో అత్యంత  పిన్న వయస్కుడినైన తనపై బాధ్యతను మోపారని, ప్రధానికి యువతపై  ఉన్న నమ్మకం దీని ద్వారా అర్థమవుతుందని అన్నారు.

100 రోజుల ప్రణాళిక తయారు చేసి, దాన్ని అమల్లోకి తీసుకువస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో పౌరవిమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు.

సామాన్య ప్రయాణికుల కోసం ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ పై దృష్టి పెడతామని, ఎయిర్ పోర్టుల నిర్మాణం వేగవంతం చేస్తామని వివరించారు. భోగాపురం ఎయిర్ పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు.

అదే సమయంలో పర్యావరణ హితంగా మంత్రిత్వ శాఖను నిర్వహిస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సమర్థ  నాయకత్వం ఎలా ఉండాలి అనేది చంద్రబాబు నుంచి నేర్చుకున్నానని తెలిపారు.

2014లో పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజు మంచి పునాదులు వేశారని వెల్లడించారు. ఉడాన్ స్కీమ్ కూడా అశోక్ గజపతిరాజు హయాంలోనే వచ్చిందని రామ్మోహన్ నాయుడు వివరించారు. అనుభవం కోసం జ్యోతిరాదిత్య సింథియా నుంచి కూడా కొంత సమాచారం తీసుకున్నానని వెల్లడించారు.

గత పథకాలను కొనసాగిస్తూ, మరిన్ని పథకాలు తీసుకువస్తామని చెప్పారు. విజనరీ నాయకులు మోదీ, చంద్రబాబు నుంచి చాలా నేర్చుకోవచ్చని అన్నారు. దేశ ప్రజలంతా గర్వించేలా పనిచేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.