రెండు బస్సులపై విరిగిపడ్డ కొండచరియలు
నదిలో కొట్టుకుపోయిన 65 మంది
నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. నారాయణఘాట్-ముగ్‌లింగ్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3.30 సమయంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో భారీగా వర్షం కూడా కురుస్తోంది. దీంతో అదే మార్గంలో దాదాపు 65 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులపై కొండచరియలు పడడంతో ఆ రెండు బస్సులు పక్కనే ఉన్న త్రిశూన్ నదిలో పడ్డాయి. గల్లంతైన వారిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలొస్తున్నాయి. కానీ,ఎటువంటి అధికారిక ధ్రువీకరణ రాలేదు. మరో బస్సుపై కొండచరియలు విరిగిపడటంతో డ్రైవర్ మృతి చెందాడు.
24 మంది ప్రయాణికుల తో ఓ బస్సు కాఠ్‌మాండూ వెళుతోంది. మరో బస్సులో 41 మంది ఉన్నట్లు గుర్తించారు. వీటిని గణపతి డీలక్స్, ఏంజెల్ బస్సులుగా గుర్తించారు. వీటిల్లో గణపతి డీలక్స్‌కు చెందినదిగా భావిస్తున్న బస్సు నుంచి ముగ్గురు ప్రయాణికులు తప్పించుకొన్నారు. బస్సు ప్రమాదానికి గురికాగానే వారు దానిలోనుంచి బయటకు దూకేసినట్లు కాఠ్‌మాండూ పోస్టు పేర్కొంది. అదే మార్గంలో మరోచోట కూడా బస్సుపై కొండచరియ విరిగిపడటంతో దాని డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ బస్సు బుట్వాల్ నుంచి కాఠ్మాండూకు వెళుతోంది. మృతుడిని మేఘ్‌నాథ్‌గా గుర్తించారు. ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు అక్కడ బాధితుల గాలింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ దేశ సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.