A place where you need to follow for what happening in world cup

గిరిజన సంక్షేమానికి పనిచేస్తున్న జాతీయ ఎస్టీ కమిషన్‌

గిరిజనుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్‌ ‌పనిచేస్తుందని జాతీయ ఎస్టీ కమిషన్‌ ‌సభ్యులు జాటోత్‌ ‌హుస్సేన్‌ ‌నాయక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ ‌ముజమ్మిల్‌ ‌ఖాన్‌తో కలిసి గిరిజనుల కోసం అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, వైద్య, ఆరోగ్య, పోలీస్‌, ‌మిషన్‌ ‌భగీరథ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్‌ ‌సభ్యులు జాటోత్‌ ‌హుస్సేన్‌ ‌మాట్లాడుతూ, గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం అధికారులు కృషి చేయాలన్నారు. గిరిజన హాస్టళ్లను గురుకులాలుగా మార్చి, సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎస్సి, ఎస్టీ విద్యార్థులు అడిగిన చోట్ల, ప్రవేశ పరీక్షలతో సంబంధం లేకుండా సీట్లు కేటాయించాలన్నారు. డా. అంబెడ్కర్‌ ఓవర్సీస్‌ ‌విద్యా పథకం అమలుపై పూర్తి నివేదిక సమర్పించాలన్నారు. ట్రైకార్‌ ‌పథక లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలన్నారు. పోడు పట్టాలపై విషయమై చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కొన్నిచోట్ల పోడు సాగు చేస్తున్న పట్టాలు లేవని, పరిశీలించి న్యాయం చేయాలన్నారు. అంగన్వాడీ లకు భవనాలు, వసతులు కల్పించాలన్నారు. గిరిజన వికాసంపై గిరిజనుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల్లో పరిశుభ్రంగా ఉంచే స్వీపర్లు లేరని, క్లినింగ్‌, ‌నిర్వహణకై చర్యలు తీసుకోవాలని అన్నారు. భూసార పరీక్షల వివరాలు సమర్పించాలన్నారు. గిరిజనుల కేసులపై వెంటనే స్పందించాలన్నారు. సింగరేణి, ఏన్కూరు మండలాల్లో మిషన్‌ ‌భగీరథ పనులు చేపట్టిన వారికి బిల్లులు రాలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.

 

ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌క్రింద ఎన్ని నిధులు మంజూరు అయినది, ఖర్చు, మిగులుపై పూర్తి నివేదిక సమర్పించాలన్నారు. గిరిజన భవన్‌ ‌నిర్వహణ చేపట్టి, వాడుకలో తేవాలన్నారు. తండాలు, గ్రామ పంచాయతీ గా మారిన చోట, భవనాలు నిర్మించాలని, ఉపాధిహామీ సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టాలన్నారు. గిరిజనుల సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కమీషన్‌ ‌సభ్యులు తెలిపారు. సమీక్షలో జిల్లా కలెక్టర్‌ ‌ముజమ్మిల్‌ ‌ఖాన్‌ ‌మాట్లాడుతూ, వివిధ శాఖల ద్వారా గిరిజన సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు జరుగుతుందన్నారు. ఆర్వోఎఫార్‌ ‌క్రింద 2022 లో క్రొత్త దరఖాస్తులు స్వీకరించి 6589 మందికి 13 వేల ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చామన్నారు.  ఎకో టూరిజంలో గిరిజనులకే ఉపాధి కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. గిరివికాసం క్రింద 318 బోర్లు, అవసరమైన చోట్ల విద్యుత్‌ ‌లైన్లు, మంజూరు చేశామన్నారు. జిల్లాలో 4800 మంది ఎస్టీ లకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. 24647 మంది గిరిజనులకు ప్రతినెలా రూ. 6.85 కోట్ల చేయూత పెన్షన్లు అందిస్తున్నామన్నారు. 18202 మంది గిరిజనులకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కు రూ. 21.86 కోట్లు ఇచ్చామన్నారు. ఉపాధి హామీ క్రింద గత సంవత్సరం రూ. 26.57 కోట్లు వేజ్‌ ‌పేమెంట్‌ ‌క్రింద గిరిజన కుటుంబాలకు అందజేశామన్నారు. జిల్లాలో 1216 పాఠశాలల్లో 60380 మంది విద్యార్థులు ఉండగా, ఇందులో 19181 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారని, 4346 మంది ఉపాధ్యాయులు ఉండగా, 669 గిరిజన ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలిపారు. పిల్లలకు యూనిఫామ్‌, ‌పాఠ్యపుస్తకాలు, బోధన ఉచితంగా అందిస్తున్నామన్నారు. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ద్వారా బోధన జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.

 

జిల్లాలో 59500 మంది గిరిజన రైతులు ఉన్నట్లు, వారందరికీ పథకాల లబ్ది అందిస్తున్నట్లు ఆయన అన్నారు. పోలీస్‌ ‌శాఖ ద్వారా 11 ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా, 6 కేసుల్లో విచారణ పూర్తి చేసినట్లు, మిగిలినవి విచారణలో ఉన్నట్లు తెలిపారు. 2020 నుండి ఇప్పటి వరకు 121 కేసుల్లో పరిహారం అందించినట్లు కలెక్టర్‌ అన్నారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కి వేగంగా పథకాలు అమలుచేస్తున్నట్లు కలెక్టర్‌ ‌తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విజ్ఞాపణలు తీసుకొని వచ్చిన వారినుండి, విజ్ఞాపణలు తీసుకొని, సంబంధిత అధికారులకు పరిష్కార చర్యలు చేపట్టాలని కమీషన్‌ ‌సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ ‌విక్రమ్‌ ‌సింగ్‌, అదనపు కలెక్టర్‌ ‌డి. మధుసూదన్‌ ‌నాయక్‌, అదనపు డిసిపి నరేశ్‌ ‌కుమార్‌, ‌డిఆర్వో ఎం. రాజేశ్వరి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి విజయలక్ష్మి, జిల్లా అధికారులు, గిరిజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.