ఇండియా ఇక భారత్‌గా మారనుందనే ప్రచారం సాగుతోంది. సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్ర మోదీ సర్కార్ ఈ ప్రతిపాదనను సభ్యుల ముందుంచనుందని భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా పేరును భారత్‌గా మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని, ఇండియా పేరు మార్చుతూ సభలో తాజా తీర్మానం ఆమోదించేందుకు మోదీ సర్కార్ పావులు కదుపుతోందని సమాచారం.
రాష్ట్రపతి భవన్ నుంచి జీ20 ప్రతినిధులకు అధికారిక సమాచారంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసిఉండటం పేరు మార్పు ప్రతిపాదనకు బలం చేకూరుస్తోంది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఈ లేఖను ట్వీట్ చేస్తూ ఈ వార్త నిజం కావచ్చని రాసుకొచ్చారు.జీ20 డిన్నర్‌కు సంబంధించి రాష్ట్రపతి ప్రతినిధులకు పంపిన ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రస్తావించారు. ప్రధాని మోదీ చరిత్రను వక్రీకరించడం కొనసాగిస్తున్నారని, ఇండియాను విభజిస్తున్నారని మరో ట్వీట్‌లో జైరాం రమేష్ మండిపడ్డారు.