- ఆకాశంలో కనువిందు చేయనున్న తోకచుక్క, ఉల్కాపాతాలు
- పింక్ మూన్ గా కనిపించనున్న చంద్రుడు
- అసాధారణ కెరటాలకు కారణం కానున్న సూపర్ న్యూమూన్
అంతరిక్షంలో జరిగే అద్భుతాలను వీక్షించడం మీకు ఇష్టమా.. అయితే మీ పంట పండింది. ఈ నెలలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా నాలుగు ఖగోళ అద్భుతాలు మిమ్మల్ని కనువిందు చేయనున్నాయి. ముఖ్యంగా ఓ తోకచుక్కను ఇప్పుడు గనక మీరు చూడలేకపోతే మళ్లీ మీ జీవితకాలంలో ఎప్పటికీ వీక్షించలేరు!
ద సూపర్ న్యూమూన్
ఇది ఏప్రిల్ 8న సంభవించనుంది. ఈ సూపర్ న్యూమూన్ మన కంటికి నేరుగా కనిపించనప్పటికీ దాని ప్రభావాలు మాత్రం స్పష్టంగా కనిపించనున్నాయి. ముఖ్యంగా ఆ రోజు సముద్ర కెరటాలు అసాధారణ స్థాయిలో ఎగసిపడనున్నాయి.
మదర్ ఆఫ్ డ్రాగన్స్
హేలీ తోకచుక్క తరహాలో ఒక తోకచుక్క ప్రస్తుతం ఆకాశంలో అలరిస్తోంది. పెద్ద తోకను తలపించే ధూళి మేఘంతో మెరిసిపోతుంది కాబట్టి ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని మదర్ ఆఫ్ డ్రాగన్స్ అని పిలుస్తున్నారు. దీనికి అధికారికంగా మాత్రం 12పీ/పోన్స్-బ్రూక్స్ అని పేరుపెట్టారు. హేలీ తోకచుక్క తరహాలోనే ఇది దాదాపుగా 71 ఏళ్లకు ఓసారి భూమిపై నుంచి వెళ్తూ కనిపిస్తుంది. ఈ తోకచుక్క ప్రస్తుతం భూమికి అతిసమీపంగా సాగిపోయే క్రమంలో ఏప్రిల్ 21 నుంచి కొన్నిరోజులపాటు ఉత్తరార్ధ గోళం నుంచి ఇది స్పష్టంగా కనిపించనుంది. ఏటా అంతరిక్షంలో సంభవించే ఉల్కా పాతాలకు ఇదే మూలకారణం. అందుకే దీన్ని ‘డెవిల్ కామెట్’ అని కూడా పిలుస్తుంటారు. ఈ తోకచుక్కను ఇప్పుడు చూడకపోతే మళ్లీ 2095 సంవత్సరం వరకు దాని కోసం వేచి చూడాల్సిందే.
లైరిడ్ ఉల్కాపాతాలు
ఏటా వసంతకాలంలో ఆకాశం నుంచి రాలిపడుతున్నట్లుగా లైరిడ్ ఉల్కలు కనిపిస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22న అత్యధిక స్థాయిలో కనిపించి వీక్షకులను కనువిందు చేయనున్నాయి. థాచర్ అనే తోకచుక్క తాలూకు రాళ్లు, ధూళితో కూడిన లైరిడ్ ఉల్కపాతాలు భూకక్ష్య మీదుగా ప్రయాణించినప్పుడు ఇవి కనిపిస్తాయి. థాచర్ తోకచుక్కను తొలిసారి 1861లో గుర్తించారు. ఈ తోకచుక్క సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి ఏకంగా 415 ఏళ్లు పడుతుందట.
పింక్ మూన్
దీన్నే ఈ నెలలో సంభవించే ఫుల్మూన్ (నిండు పున్నమి)గానూ పిలుస్తారు. ఇది ఏప్రిల్ 23న మొదలై మూడు రోజులపాటు కనిపించనుంది. పింక్ మూన్ అని దీన్ని పిలుస్తున్నప్పటికీ వాస్తవానికి ఇదేమీ గులాబీ రంగులో ఉండదు. ఈ కాలంలో ఎక్కువగా గులాబీ రంగు పూలు పూస్తాయి కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఆ రోజు చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు.