పార్టీకి ద్రోహం చేసిన శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలి
కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ అగ్నిగుండమే..
వరంగల్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు
బీఆర్ ఎస్ నుంచి కడియం శ్రీహరి పోయాక పార్టీలో జోష్ కనిపిస్తోందని, పదేళ్లుగా పదవులు పొంది.. కూతురికి టికెట్‌ను తీసుకుని పార్టీకి ద్రోహం చేసిన శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పార్టీ మారేదేలేదని చెప్పిన శ్రీహరి ఎందుకు మారాడో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీశ్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కడియంకు నైతిక విలువలు ఉంటే బీఆర్‌ఎస్ ద్వారా వొచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దొంగలతో కండువా కప్పించు కునే స్థాయికి శ్రీహరి దిగజారుడు అవసరమా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతున్నాయని, అలాంటి పార్టీలోకి శ్రీహరి పోయాడని విమర్శించారు. కష్టపడే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుందని, ద్రోహం చేసినవాళ్లను మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వరంగల్ తొలి నుంచి ఉద్యమాల గడ్డ అని, బీఆర్‌ఎస్‌కు అండగా ఉందని, కార్యకర్తల కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకున్నా తక్కువేనని కొనియాడారు. వరంగల్ అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఎంతో కృషి చేసిందని, ఐదు మెడికల్ కాలేజీలు, 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ , కాకతీయ టెక్స్ టైల్ పార్కు తెచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంలోని కాకతీయ తోరణాన్ని తీసేస్తామని రేవంత్ అంటున్నారని, అదే జరిగితే వరంగల్ అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుందని, కాకతీయ తోరణం వరంగల్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని గుర్తుచేశారు. రెండు లక్షల రుణమాఫీ, పింఛన్ పెంపు, రైతుబంధు పెంపు, వడ్లకు బోనస్, మహిళలకు 2500.. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఆరోపించారు. ఈ హామీలు అమలైన వాళ్లు కాంగ్రెస్‌కు వోటువేయాలని కానివాళ్లు బీఆర్‌ఎస్‌కు వోటేయాలని సూచించారు. కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని, కష్టాలు మనకు కొత్తకాదని, రేవంత్ నాయకులను కొనగలడేగాని ఆత్మగౌరవమున్న ఉద్యమ నాయకులను కొనలేడని తెలిపారు. నిరుద్యోగులకు 4 వేల భృతి ఇస్తామని వాళ్లనూ మోసం చేసింది కాంగ్రెస్. ఆ హామీనే ఇవ్వలేదని అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అబద్ధమాడారని విమర్శించారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని, వడ్లను రూ. 2500కు కొన్నాకనే పార్లమెంటు ఎన్నికల్లో వోటు అడగాలన్నారు. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించి చెప్పండి. అన్ని చోట్లా చర్చకు పెట్టండి. అని పిలుపునిచ్చారు. ఎంపీ ఎన్నికల్లో వోట్లు అడిగేందుకు బీజేపీకి కూడా వొస్తున్నదని , రైతుల ఉసురు పోసుకున్న చరిత్ర బీజేపీదని మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు.. దేశంలో నిరుద్యోగం, పేదరికం ఆకలి పెరిగాయి. అన్నీ పడిపోతున్నాయి. సీబీఐ, ఈడీ కేసులు మాత్రం పెరిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ మాట వింటే జోడీ, వినకపోతే ఈడీ అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటే. మేం బీజేపీతో చేతులు కలిపితే కవిత ఎందుకు జైలుకు వెళ్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వొచ్చాక ముస్లిం సోదరులకు తోఫా బంద్ అయింది. మైనారిటీల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారు. మీరు బీఆర్‌ఎస్‌కు వోటు వేస్తే అసెంబ్లీలో హామీలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. ప్రశ్నించే బలాన్నిమాకివ్వాలి. రేవంత్ పేగులు మెడలో వేసుకోకుండా, పేదలకు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మానవబాంబులా మారకుండా మానవీయ పాలన అందించాలి. రేవంత్ వంద రోజుల పాలనలో 200 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్కనాడన్నా వాళ్ల కుటుంబాలను పరామర్శించావా? ఒక్క రూపాయన్నా ఇచ్చి ఆదుకున్నావా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పని అయిపోయిందని అంటున్నారు. తెలంగాణ ఉన్నంతవరకు బీఆర్‌ఎస్ ఉంటుంది. బీఆర్‌ఎస్ పాలపొంగు అన్న టీడీపీనే తెలంగాణలో లేకుండా పోయింది. కేసీఆర్ పొలం బాట కార్యక్రమానికి అద్భుత స్పందన వొస్తున్నది , ఆరు నూరైనా, అటు సూర్యుడు ఇటు పొడిచినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్సే అని ధీమా వ్యక్తం చేశారు.దిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చే ప్రసక్తే లేదని దానికి వోటు వేయడం వ్యర్థమని హరీశ్ రావు స్పష్టం చేశారు.
నిరుద్యోగులకు భారంగా టెట్ ఫీజులు
సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం