- ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో హోరెత్తిన సభ
- సభ మంగళవారానికి వాయిదా
న్యూఢిల్లీ జూలై 24:మణిపూర్‌లో హింసాత్మక ఘటనలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సోమవారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతున్నది. ఉదయం సభ ప్రారంభమవగానే ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మొదలుపెట్టారు. మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని, దానిపై ప్రధాని మోదీ సభాముఖంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి.ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. దాంతో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభను ముందుగా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 12 గంటలకు సభ ప్రారంభమవగానే ప్రతిపక్షాల ఆందోళన కంటిన్యూ అయ్యింది.
దాంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది. రెండు గంటలకు సభ పునఃప్రారంభమైన పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. దాంతో స్పీకర్ సభను మంగళవారం ఉదయానికి వాయిదా వేశారు.అంతకుముందు ప్రతిపక్ష సభ్యుల నినాదాల నడుమే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో మాట్లాడారు. మణిపూర్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, చర్చ నిర్వహించేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. అయితే ఒకవైపు చర్చకు నిరాకరిస్తూనే, మరోవైపు చర్చకు సిద్ధమంటూ కేంద్రం ప్రకటించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.