- ఆరెస్సెస్ అనుబంధ సంస్థ జనసేవా ట్రస్టుకు 35.33 ఎకరాల భూమిని కేటాయించిన గత బీజేపీ ప్రభుత్వం
- 2023 మే 22న భూమిని అప్పగిస్తూ జారీ అయిన ఆదేశాలు
- ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి జరిగిన భూ కేటాయింపులను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఆరెస్సెస్ కు కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం షాకిచ్చింది. గత బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఆరెస్సెస్ అనుబంధ సంస్థ అయిన జనసేవా ట్రస్టుకు 35.33 ఎకరాల భూమిని కేటాయించింది. బెంగళూరు దక్షిణ తాలూకాలోని కురుబరహళ్లి పంచాయతీ తావరకెరె పరిధిలో ఈ భూమి ఉంది. 2023 మే 22న జనసేవా ట్రస్టుకు భూమిని అప్పగిస్తూ జిల్లా అధికారి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ భూమిని అప్పగించేందుకు తగిన అనుమతులు జారీ కావాల్సి ఉంది.
ఈ క్రమంలో భూమిని అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి అప్పటి బీజేపీ ప్రభుత్వం కేటాయించిన అన్ని భూములను రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రకటించింది. చెప్పిన విధంగానే 35.33 ఎకరాల భూమిని అప్పగించేందుకు అభ్యంతరం తెలిపింది.