-
కాంగ్రెస్ వస్తే 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తుందన్న రేవంత్
- కేసీఆర్ కరెంటు అవినీతిని అంతం చేస్తుందని హెచ్చరిక
-
తానా సభల్లో చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పష్టత నిచ్చిన పీసీసీ చీఫ్
తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌కి సంబంధించి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజకీయమంతా ఉచిత విద్యుత్ చుట్టూనే తిరుగుతోంది. తానా సభల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
తన వ్యాఖ్యలపై ఇప్పటికే స్పష్టత నిచ్చిన రేవంత్.. తాజాగా మరో ట్వీట్ చేశారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుంది. కేసీఆర్ కరెంటు అవినీతిని అంతం చేస్తుంది” అని ఈ రోజు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తన పోస్ట్‌కు ‘బైబై కేసీఆర్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.
ఇటీవల తానా మహాసభల కోసం అమెరికా వెళ్లిన రేవంత్.. తెలంగాణలో రైతులకు కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారని, అది అవసరం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మూడెకరాలలోపు పొలం ఉన్న రైతులే ఎక్కువమంది ఉన్నారని, మూడు గంటలు ఉచిత కరెంట్ ఇస్తే సరిపోతుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేసింది.