- శైలేష్ కొలను దర్శకత్వంలో పోరాట సన్నివేశాల చిత్రీకరణ!
- నిర్మాత దిల్ రాజు, శంకర్ కు విభేదాలు వచ్చినట్టు పుకార్లు
- ప్రస్తుతం కమలహాసన్ ‘ఇండియన్2’ చిత్రీకరణలో బిజీగా ఉన్న శంకర్
ప్రముఖ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తండ్రయిన నేపథ్యంలో కొన్ని రోజులు షూటింగ్ కు గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఒక యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే, దీనికి శంకర్ కాకుండా ‘హిట్’ సినిమాకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను డైరెక్షన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు శంకర్ చెన్నై లో కమల హాసన్ తో చేస్తున్న ‘ఇండియన్ 2’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
సినిమాకి సంబంధించి ఏ చిన్న విషయాన్ని అయినా దగ్గరుండి చూసుకునే శంకర్ లేకుండా ‘గేమ్ చేంజర్’ సినిమా చిత్రీకరణ జరగడం వెనుక కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిర్మాత దిల్ రాజుకి, శంకర్ కి మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా? అన్న చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా అనుకున్న దానికంటే ఇప్పటికే బాగా ఆలస్యం అవుతోంది. శంకర్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తుండటంతో నొచ్చుకున్న దిల్ రాజు ఇలా మరో దర్శకుడి పర్యవేక్షణలో పోరాట సన్నివేశాలే కదా అని చేయిస్తున్నారన్న టాక్ నడుస్తోంది.