- అమృతహళ్లిలోని పంపా ఎక్స్ టెన్షన్ లో ఉన్న ఐటీ సంస్థ
- ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలిన ఎండీ, సీఈవో
- హంతకుడు పరారీలో ఉన్నాడన్న డీసీపీ లక్ష్మీప్రసాద్
ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏరోనిక్స్ ఇంటర్నెట్ అనే ఐటీ కంపెనీ ఎండీ ఫణీంద్ర సుబ్రహ్మణ్య, సీఈవో విను కుమార్ లను ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఫెలిక్స్ దారుణంగా హతమార్చాడు. కంపెనీలోకి ప్రవేశించిన ఫెలిక్స్ తన వెంట తెచ్చుకున్న కత్తితో వీరిద్దరినీ నరికాదు. తీవ్రంగా గాయపడ్డ వీద్దరినీ కంపెనీ ఇతర ఉద్యోగులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే వీరు ప్రాణాలు కోల్పోయారు.
బెంగళూరులోని అమృతహళ్లిలో ఉన్న పంపా ఎక్స్ టెన్షన్ లో ఈ ఐటీ కంపెనీ ఉంది. ఫెలిక్స్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని నార్త్ ఈస్ట్ బెంగళూరు డీసీపీ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఫెలిక్స్ కూడా ప్రస్తుతం అటువంటి కంపెనీనే నిర్వహిస్తున్నాడని… అయితే, అతని బిజినెస్ కు వీరిద్దరూ ఆటంకాలను కల్పిస్తుండటంతోనే వారిని హతమార్చినట్టు చెపుతున్నారు.