- ములుగు జిల్లాను వీడని అధికార గణం
- స్థాన చలనం లేని గులాబీ దండు
- మాఫియా అండదండలతో చెలరేగిపోతున్నపలువురు అధికారులు
- కాసులు పడేస్తే ఏ పనికైనా ఓకే
- ప్రభుత్వం మారినా తీరు మారని వైనం
- ఉత్సవ విగ్రహాలుగా ఐఏఎస్ లు
- తన వరకూ వచ్చినా స్పందన లేని మంత్రి
ప్రభుత్వం మారినా ములుగు జిల్లాలో అధికారుల తీరు మార లేదు. ఏండ్ల తరబడి ఇక్కడే తిష్ట వేసిన కొందరు అధికారులు అవినీతి తిమింగలాలుగా మారినా వారి గురించి పట్టించుకునే వారే లేరు. జిల్లాలోని గోదావరి తీరంలో ఇసుక రీచ్ లను తమ ఆదాయ వనరుగా మార్చుకున్న అధికార యంత్రాంగం అమాయకులైన ఆదివాసీలను మోసం చేస్తూ బినామీ కాంట్రాక్టర్ల సేవలో తరించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదలైన అవినీతి నేటికీ కొనసాగుతూనే ఉన్నది.
ఏజెన్సీ ప్రాంతంలో ‘పీసా’ చట్టం అమల్లో ఉండటంతో ఇసుక రీచ్ లను ఆదివాసీ సహకార సంఘాలకు అప్పగిస్తున్నారు. ఈ సంఘాల వద్ద పెట్టుబడులు లేక పోవడంతో బినామీ కాంట్రాక్టర్ల వ్యవస్థను ప్రభుత్వమే పరోక్షంగా ప్రవేశపెట్టింది. సహకార సంఘాల పేరుతో రంగ ప్రవేశం చేసిన బినామీ కాంట్రాక్టర్లు అవినీతి అధికారుల అండదండలతో తమ పని పూర్తి చేసుకుంటున్నారు.
ఇసుక రీచ్ ల సర్వే నుంచి సహకార సంఘాలకు కేటాయింపులు, నిర్వహణ వరకూ అడుగడుగునా అధికారులకు చేతులు తడపక పోతే ఏ పనులూ జరగవు. సర్వే కోసం మైనింగ్, భూగర్భ జలం, ఇరిగేషన్, రెవిన్యూ శాఖలు భారీగా ముడుపులు తీసుకుంటున్నాయి. శాస్త్రీయమైన విధానం లేకుండా కాంట్రాక్టర్లు కోరిన చోట సర్వే చేయడం, వారు కోరినంత ఇసుక సిఫారసు చేయడానికి లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి.
రింగ్ లీడర్..
ఇసుక రీచ్ ల సర్వే సమయంలో అవినీతి అధికారులను సమన్వయ పరచే పనిని ఒక కింది స్థాయి అధికారి తన చేతుల్లోకి తీసుకుని రింగ్ లీడర్ గా మారాడు. రీచ్ లలో ఎంత ఇసుక తీయాలో నిర్ధారించే ఈ భూగర్భ అధికారి అవినీతి పరాకాష్ఠకు చేరుకున్నది. గత పదేండ్ల కాలం నుంచి ములుగు జిల్లాలోనే పాతుకు పోయిన ఈ అధికారి కోట్లకు పడగలెత్తాడనే ఆరోపణలు ఉన్నాయి. తాము పెద్ద మొత్తంలో లంచం తీసుకోవడమే కాక మిగిలిన శాఖల అధికారులకు కూడా ఈ అధికారే ముడుపులు ఇప్పిస్తాడనే ప్రచారం జరుగుతున్నది. ఈ అధికారి అక్రమార్జన సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా ఉంటుందని సహచర అధికారులే అంటున్నారు. ప్రభుత్వం మారినా ఈ అధికారిని బదిలీ చేయక పోగా అతని స్థాయికి మించిన మరో కీలక పోస్టులో ఇటీవల నియమించడం సంచలనం కలిగించింది. ఎవరిని పట్టుకున్నాడో తెలియదు కానీ తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా కొత్త అవతారం ఎత్తాడు. వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామం వద్ద బినామీ పేరుతో వెయింగ్ మిషన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇసుక లారీల కాంట్రాక్టర్లు చేస్తున్న అక్రమ వసూళ్ళలో ఈ అధికారి భారీగా వాటా తీసుకుంటున్నాడు. తన వాటాతో పాటూ సంస్థలోని పై వారికి కూడా వాటా నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నాడు.
సహకార ‘డాన్’..
బినామీ ఇసుక కాంట్రాక్టర్లకు పూర్తి సహకారం అందించి ఏ రీచ్ ఏ సహకార సంఘానికి కేటాయించాలనే విషయంలో చక్రం తిప్పతున్న అధికారి అవినీతికి అంతులేకుండా పోయింది. అమాయకులైన ఆదివాసీ సహకార సంఘాలను వేధింపులకు గురి చేస్తూ నిబంధనల పేరుతో తిమ్మిని బమ్మిని చేస్తూ కాంట్రాక్టర్ల సేవలో తరిస్తున్న ఈ అధికారి జిల్లా కలెక్టర్లను కానీ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులను కానీ లెక్క చేయడనే పేరుంది. సహకార సంఘం నమోదు చేయాలన్నా, కమిటీ మార్చాలన్నా, చివరికి లెక్కల ఆడిట్ వరకూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ఆ అధికారి వ్యవహారంపై ఏసీబీ కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. అన్ని అర్హతలూ ఉన్న సహకార సంఘాలకు కూడా చిన్న చిన్న సాంకేతిక కారణాలతో అనర్హత వేటు వేయడం, మరో సహకార సంఘానికి లబ్ది చేకూర్చడం కోసం పది లక్షలకు పైగా ముడుపులు బాహాటంగా వసూలు చేస్తున్నా ఈ అధికారి గురించి కలెక్టర్ కానీ మంత్రి కానీ పట్టించుకోక పోవడం చర్చనీయాంశంగా మారింది. హన్మకొండ లోని తన ఇంటి వద్ద ముడుపులు తీసుకుంటున్న ఈ అధికారి గత ఐదేండ్ల కాలంలోనే రూ. ఐదు కోట్లకు పైగా సంపాదించడనే పేరుంది. ఒక గ్రామంలో ఒకే సహకార సంఘం ఉండాలని గతంలో కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను కూడా బేఖాతర్ చేసి పెద్ద సంఖ్యలో సహకార సంఘాలను నమోదు చేయించాడం ద్వారా భారీ వసూళ్ళకు ఈ అధికారి పాల్పడ్డాడు. ఇతని చర్యల ద్వారా ఆదివాసీ గ్రామాల్లో గొడవలు జరుగుతూ అశాంతి నెలకొని ఉంది.
‘పీసా’ బాస్..
ఏటూరునాగారం ఐటీడీఏ లో అవినీతికి చిరునామాగా మారిన అనధికార ప్రతినిధి గురించి మంత్రి సీతక్కకు కూడా అనేక ఆరోపణలు అందాయి. ఇసుక రీచ్ లను సహకార సంఘాలకు కేటాయించడానికి ‘పీసా’ చట్టం ప్రకారం గ్రామసభలు నిర్వహించాల్సి ఉంది. ఈ వ్యవహారమంతా ప్రాజెక్టు అధికారి, సంబంధిత అధికార యంత్రాంగం చూసుకుంటుంది. కానీ ఏటూరునాగారంలో ప్రాజెక్టు అధికారి కన్నా తనదే పెద్ద పోస్టు అనే విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తి అవినీతికి చిరునామాగా మారాడు. కాంట్రాక్టర్లు ముందుగా అతన్ని కలిస్తే చాలు. గ్రామసభ ఎప్పడు పెట్టాలో, ఏ విధంగా వ్యవహరిస్తే ఇసుక రీచ్ దక్కుతుందో చెప్పేస్తాడు. అవినీతి అధికారులందరినీ సమన్వయ పరుస్తూ పనిని చక్కపెట్టడంలో దిట్టగా మారిపోయాడు. కేవలం గౌరవ వేతనంతో గులాబీ ప్రభుత్వం నియమించిన
అనధికార బాస్ ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మార్చక పోవడం పట్ల ఆదివాసీ సంఘాలు మంత్రి ముందే నిరసన తెలిపాయి. ములుగు బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి భంగ పడిన అనధికారిక బాస్ ఆగడాలపై దర్యాప్తు జరిపించాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నాయి.
సీతయ్య..
అతను పంచాయితీరాజ్ శాఖలో కేవలం ఒక మండలానికి అధికారిగా ఉన్నాడు. శకుని మామగా పేరు తెచ్చుకున్నాడు. ఉద్యోగ విరమణకు దగ్గర పడిన ఈ అధికారి సంబంధిత శాఖ మంత్రి సీతక్క మాట కూడా వినడు. ఎమ్మెల్యే ఫోన్ కూడా ఎత్తడు. ఇసుక రీచ్ ల కేటాయింపుల కోసం గ్రామసభలు నిర్వహించే అధికారం అతనికి ఉండటంతో అవసాన కాలంలో వచ్చిన అరుదైన అవకాశాన్ని వినియోగించుకుంటూ కాంట్రాక్టర్ల వద్ద భారీగా ముడుపులు మింగేస్తున్నాడు. అనుకూలమైన వారికి మేలు చేయడానికి, వ్యతిరేకులకు అన్యాయం చేయడానికి కోడిగుడ్డుకు ఈకలు పీకుతూ నిబంధనల పేరుతో ఆదివాసీలను ఇరుకున పెడుతున్నాడు. హన్మకొండ నివాసం వద్దే ముడుపులు తీసుకుంటున్నాడనే ఆరోపణలు వచ్చాయి.
ఉత్సవ విగ్రహాలుగా కలెక్టర్, పీవో..
ములుగు జిల్లాలో ఇసుక రీచ్ ల వ్యవహారంలో జరుగుతున్న అవకతవకలపై ఎన్ని విమర్శలు వచ్చినా జిల్లా కలెక్టర్ కానీ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కానీ పట్టించుకోరు. కృష్ణ ఆదిత్య జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కాలంలో బినామీ కాంట్రాక్టర్లు, అవినీతి అధికారులకు వణుకు పుట్టించారు. ఆయన వెళ్ళి పోయిన తర్వాత అవినీతి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి లారీకి లోడింగ్ పాయింట్ వద్ద రూ. 10 వేలు అదనంగా వసూలు చేస్తున్నా వీరు పట్టించుకోరు. బినామీ కాంట్రాక్టర్లకు నిబంధలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు బిల్లులు చెల్లిస్తున్న ప్రాజెక్టు అధికారులు వివాదాలకు కేంద్రం బిందువుగా మారి పోయారు. ఫిర్యాదులపై కనీసం స్పందించరు.